బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్,మాజీ మంత్రి హరీశ్ రావుకు బడా కంపెనీలు ఉన్నాయని, ఈ విషయం ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తున్నారని పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇదే విషయంపై నిన్న టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా ‘ఎక్స్’ ఖాతా వేదికగా చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా ఉన్న హరీశ్ రావు.. అనేక కంపెనీలు పెట్టారని ఈ పోస్టు సారాంశం.
పదేండ్ల పాలనలో అవినీతికి పాల్పడిన హరీశ్..ఇప్పుడు ప్రజల ముందు కమల్ హాసన్‌లా నటిస్తున్నారని.. ఆయన అవినీతి సామ్రాజ్యాన్ని తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆసుపత్రులతో వ్యాపారం చేస్తూ, తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారని ఆరోపించింది. ARVAIS NATURES PRODUCTS PRIVATE LIMITED (Milchy Milk) హరీశ్ రావు వైద్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కంపెనీ ఒక్క ఏడాదిలోనే 614% వృద్ధి సాధించిందని.. ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టకముందు దాని రూ.7 కోట్ల మాత్రమే అని తెలిపింది.
బీఆర్ఎస్ అధికారం నుంచి దిగిపోయే నాటికి ఆ కంపెనీ విలువ రూ.198 కోట్లకు చేరిందని తెలంగాణ కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. ఆయనకు చెందిన మరో కంపెనీ JIVA TECH SURGICALS PRIVATE LIMITEDలోనూ 13.9% నష్టాల్లో ఉన్న వ్యాపారం ఒక్కసారిగా భారీగా 54% వృద్ధితో దూసుకెళ్లిందని వెల్లడించింది. ఇది ఎలాసాధ్యమైంది? ఇది క్విడ్ ప్రో కోనా? లేక అధికార దుర్వినియోగమా? లేక బరితెగింపా? అనేది బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
ఇదిలాఉండగా,నిన్న కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ.. హరీశ్ రావు అటు బీజేపీ.. ఇటు సీఎం గుంపుమేస్త్రితో దోస్తానా చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్‌కు అధికారం చేజిక్కకుండా మెదక్ ఎమ్మెల్యేలతో సీక్రెట్ మీటింగ్ నిర్వహించారని.. మరోవైపు బీజేపీ నేతలతోనూ రహస్యంగా భేటీ అవుతున్నారని ఆరోపించారు. ఇక లండన్‌లో గుంటనక్క, గుంపు మేస్త్రీ లాలూచీ పడ్డారని.. రహస్యంగా సమావేశమై అగ్రిమెంట్ చేసుకున్నారని పేర్కొంది. ఒకవేళ గుంటనక్కతో గుంపు మేస్త్రీకి ఎలాంటి లాలూచీ లేకపోతే ఆయన్ను క్విడ్ ప్రో కో కింద అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేసింది.
https://x.com/INCTelangana/status/2092920264682303604?s=20
హరీశ్‌రావు హెల్త్ మినిస్టర్‌గా ఉన్న సమయంలో నారాయణ, చైతన్య కాలేజీలకు నెలకు రూ.5 కోట్ల పాలు పోశారని.. 8 ఏళ్లపాటు ఆ రెండు సంస్థల ద్వారా రూ.960 కోట్లు దండుకున్నారని కవిత ఆరోపించారు. అంతేకాకుండా కామినేని, యశోద, కిమ్స్ లాంటి కార్పొరేట్ హాస్పిటల్స్‌కు సైతం పాలు సరఫరా చేశారన్నారు. ఇదంతా క్విడ్ ప్రో కో కిందకు రాదా? అని ఆమె ప్రశ్నించారు. గతంలో ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అంశంలో హరీశ్ పేరు ఎత్తిన సీఎం ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కచ్చితంగా వీరి మధ్య లండన్‌లో లలూచీ అయ్యిందని ఆరోపించారు.












