హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ యూనివర్సిటీలో నిన్న రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తీజ్ పండుగ వేడుకల నేపథ్యంలో విద్యార్థుల మధ్య ఘర్షణ నెలకొంది.ఈ క్రమంలోనే ఓ విద్యార్థిపై పలువురు విద్యార్థులు దాడులు చేయగా.. ఆ తర్వాత రెండు గ్రూపులుగా ఏర్పడి కొట్టుకున్నట్టు సమాచారం. ఇటీవలి కాలంలో జేఎన్‌టీయూ వర్సిటీ వరుస వివాదాలకు నిలయంగా మారుతోంది. గతంలోనూ వర్సిటీలో సెక్యూరిటీ సిబ్బంది అమ్మాయిలను వేధిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి.
నిన్న రాత్రి యూనివర్సిటీలో ‘తీజ్’ పండుగ వేడుకలు నిర్వహించేందుకు విద్యార్థులు ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లు పూర్తయ్యాక విద్యార్థులు ఆటపాటలతో సరదాగా గడిపినట్టు సమాచారం.ఈ క్రమంలోనే ఓ విద్యార్థితో పలువురు విద్యార్థులు వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది.వీరి గొడవకు ప్రేమ వ్యవహారమే కారణమని టాక్ వినిపిస్తోంది. అయితే, ముందుగా ఓ విద్యార్థిపై పలువురు విద్యార్థులు దాడికి పాల్పడ్డారు.
ఆ తర్వాత గొడవ కాస్త ముదిరింది. అనంతరం గౌతమి, మంజీర హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకున్నారు. కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. గాయపడిన విద్యార్థులను వర్సిటీ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.
https://x.com/pulsenewsbreak/status/2095706464983851339?s=20
అయితే, విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకుంటుండగా ఆ ఘర్షణను ఓ విద్యార్థి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. వైరల్ అవుతోంది.ఈ వీడియో బయటకు రావడంపైనా వర్సిటీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. దీనిపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వర్సిటీ అధికారులు పేర్కొన్నట్టు సమాచారం.









