Chinna Reddy: తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి తనను తప్పిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయంపై చిన్నారెడ్డి స్పందించారు. నాకు పదవులపై సోకు లేదని ఆయన అన్నారు. కష్టపడి ఈ స్థాయికి వచ్చానని, ఒక్క పోటుతో కూల్చేశారని వాపోయారు. ఇందిరాగాంధీ పార్టీ పెట్టినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని తెలిపారు. తనకు ప్లానింగ్ కమిషన్ పదవిని ‘టిల్ ఫర్దర్ ఆర్డర్స్’ పేరుతో ఇచ్చారని, ఈరోజే ఆ ఉత్తర్వులు వచ్చాయన్నారు. పదవులు ఉన్నా లేకున్నా నా గౌరవం నాకు ఉంటుందన్నారు చిన్నారెడ్డి. పదవి కోసం రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం కూడా చేయలేదన్నారు.
నా మనుషులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు వెళ్తే మెడ పట్టి బయటకు గెంటేస్తానని ఎమ్మెల్యే మేఘా రెడ్డి అన్నారు, అయినా భరించాను అని చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా ఉన్న సమయంలోనే ప్రోటోకాల్ సదుపాయాలను తాను వదులుకున్నానని గుర్తుచేశారాయన.
కాగా, పదవి నుంచి తొలగించిన వెంటనే చిన్నారెడ్డి తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. తనను కలిసేందుకు వచ్చిన అనుచరులు, మీడియా ప్రతినిధులతో మాట్లాడేందుకు నిరాకరించారు చిన్నారెడ్డి. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం జయన్న తిరుమలాపూర్లో చిన్నారెడ్డికి వ్యవసాయ క్షేత్రం ఉంది.
కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి ఆగస్టు 16న వనపర్తి నియోజకవర్గంలోని గోపాల్‌పేట సభలో సొంత పార్టీకే చెందిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపైన, పార్టీ హైకమాండ్ పైన తీవ్ర ఆరోపణలు చేశారు. మేఘారెడ్డి డబ్బులిచ్చి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచాక కాంగ్రెస్‌ను అవినీతి పార్టీగా మార్చారని, తన పనులకు కూడా అడ్డుపడుతున్నారని మేఘారెడ్డిపై చిన్నారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కార్యకర్తలను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తన ఓపిక నశిస్తే మరో జీవన్‌రెడ్డిలా మారి తిరగబడతానని చిన్నారెడ్డి హెచ్చరించారు.
సొంత పార్టీ ఎమ్మెల్యేపైన, పార్టీ హైకమాండ్ పైన చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో కలకలం రేపాయి. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై వేటు వేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఆయనను ఆ పదవి నుంచి సీఎంవో తప్పించింది. చిన్నారెడ్డి స్థానంలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్‌పర్సన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.









