Buyyani Manohar Reddy: తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి వ్యవహారశైలిపై బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కంటే భూముల వ్యవహారాలపైనే ఎమ్మెల్యే కుటుంబానికి ఆసక్తి ఎక్కువగా ఉందని విమర్శించారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఎమ్మెల్యే వ్యవహారాలపై సీఎం స్థాయిలోనే ప్రస్తావనలు రావడం ఆయన తీరుపై ప్రశ్నలు తలెత్తేలా చేస్తోందన్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వికారాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, నాయకులు నర్సింహులు, నరేందర్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు పరిమళ, శోభారాణి మాట్లాడారు.
కొడంగల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందించారని అన్నారు. తాను అవినీతి చేయలేదని మనోహర్ రెడ్డి చెప్పుకుంటున్నా.. ఆయన అవినీతి ఏమిటో మాకు తెలుసన్నారు రాజు గౌడ్. అవినీతి రుజువు చేస్తే రాజీనామా చేస్తా అన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలన్నారు.
వివాదాస్పద భూమి విక్రయించిన ఎమ్మెల్యే కుమారుడు!
ఫ్యూచర్ సిటీ సమీపంలోని తుమ్మలూరులో సుమారు 24 ఎకరాల వివాదాస్పద భూమిని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కుమారుడు కొనుగోలు చేసి విక్రయాలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. సదరు భూమిపై సీబీఐ కేసుతో పాటు హైకోర్టులోనూ వివాదాలు ఉన్నాయని, భూమి విషయంలో న్యాయపరమైన ఆంక్షలు ఉన్నప్పటికీ 5 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ జరిగిందని వెల్లడించారు.
అదే సమయంలో పక్కనే ఉన్న అటవీ భూమిపైనా ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే తన వైఖరిని ప్రజలకు స్పష్టం చేయాలన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని నిరూపించేందుకు సిద్ధమా? అని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సవాల్ విసిరారు బీఆర్‌ఎస్ నాయకులు.
ఇబ్రహీంపట్నంలో 33 ఎకరాల ప్రభుత్వ భూమిపై ఆరోపణలు
''హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో సుమారు 33 ఎకరాల ప్రభుత్వ భూమిని జేబీ ఇన్‌ఫ్రా సంస్థ ద్వారా కొనుగోలు చేసి, అనంతరం ప్లాట్లుగా మార్చి విక్రయించారు. సదరు భూమి ప్రభుత్వ భూమిగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. అక్కడ ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూముల వ్యవహారంలో ఎమ్మెల్యేకు సంబంధం లేదని నిరూపించాలని, ఈ ఆరోపణలపై సమగ్ర విచారణకు సిద్ధమా? అని బీఆర్ఎస్ నాయకులు సవాల్ చేశారు.
వికారాబాద్ పరిధిలో 250 ఎకరాల వ్యవహారం
వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని మర్రి మండలం వీర్లపల్లి, మోమిన్‌పేట్ మండలంలోని కేసారం, ఎస్పల్లి గ్రామాల్లో సుమారు 250 ఎకరాల వివాదాస్పద భూముల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి భాగస్వామ్యం ఉందని ఆరోపిస్తున్న జేబీ కంపెనీ కొనుగోలు చేసిందని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. ఆ భూములను ప్లాట్లుగా అభివృద్ధి చేసి పలువురికి విక్రయించారని చెప్పారు. ఈ భూములకు సంబంధించి కోర్టుల్లో వివాదాలు కొనసాగుతున్నాయని, బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారని వెల్లడించారు. వివాదాస్పద భూముల కొనుగోలు, విక్రయాలపై ఎమ్మెల్యే స్పష్టమైన వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.
డీసీసీబీ చైర్మన్‌గా ఉన్నప్పుడు ఏం జరిగింది..?
మనోహర్ రెడ్డి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్‌గా ఉన్న సమయంలో సహకార సంఘాల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన గోదాములు, రైస్ మిల్లులు, పెట్రోల్ బంకుల నిర్మాణ పనులను సరైన టెండర్ ప్రక్రియ లేకుండా ఒక కాంట్రాక్టర్‌కు అప్పగించారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. ఈ పనుల్లో భారీగా అవినీతి జరిగిందని, అనేక చోట్ల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయన్నారు. కాంట్రాక్టర్ అందుబాటులో లేకపోవడంతో పనులు పూర్తికాక సహకార సంఘాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు.
ఆలయ స్థలాల్లో దుకాణాల నిర్మాణాల్లో అక్రమాలు
తాండూరులో ఆలయాలకు సంబంధించిన ఖాళీ స్థలాల్లో దుకాణాల నిర్మాణం, నిధుల వినియోగం, టెండర్ల ప్రక్రియ, దుకాణాల కేటాయింపుల విషయంలోనూ అనేక అనుమానాలు ఉన్నాయని వారు ఆరోపించారు. దుకాణాల నిర్మాణానికి కేటాయించిన నిధులు ఎక్కడ ఖర్చయ్యాయి..? టెండర్లు నిర్వహించారా..? దుకాణాల లబ్ధిదారులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు..? అనే అంశాలపై ప్రజలకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై తాము చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణకు ప్రభుత్వం సిద్ధం కావాలని బీఆర్‌ఎస్ నాయకులు అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైతే ఎమ్మెల్యే ఆధారాలతో వాటిని ఖండించాలన్నారు. నిజానిజాలు వెలుగులోకి రావాలంటే స్వతంత్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.









