తెలంగాణ

KTR: పాదయాత్ర చేస్తానని కేటీఆర్ కీలక ప్రకటన.. ప్రభుత్వానికి 10రోజుల డెడ్‌లైన్

రచన: NK9 నిమిషాల పఠనం

KTR: రైతన్నల పంటలను కాపాడేందుకు మరోసారి పోరాటానికి సిద్ధమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద పంటలు ఎండిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. సెప్టెంబర్ 14లోపు ఎడమ కాలువకు నీటిని ఎప్పుడు, ఎంత మేరకు విడుదల చేస్తారో స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.

* రైతన్నల కోసం పాదయాత్ర

* ఈ నెల 14లోపు సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల షెడ్యూల్ ఇవ్వాలి

* లేకుంటే కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర

* 2003లో కేసీఆర్ పోరాట స్ఫూర్తితో మరో ఉద్యమానికి సిద్ధం

* బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

KTR: రైతన్నల పంటలను కాపాడేందుకు మరోసారి పోరాటానికి సిద్ధమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద పంటలు ఎండిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. సెప్టెంబర్ 14లోపు ఎడమ కాలువకు నీటిని ఎప్పుడు, ఎంత మేరకు విడుదల చేస్తారో స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. గడువులోగా స్పందించకపోతే వేలాది మంది రైతులతో కలిసి కోదాడ నుంచి హాలియా వరకు స్వయంగా పాదయాత్ర చేపడతానని ప్రకటించారు.

చుక్క నీరు ఇవ్వకపోవడం దారుణం

గురువారం మిర్యాలగూడ రైతు మహాధర్నాలో కేటీఆర్ మాట్లాడారు. సాగర్‌లో ప్రస్తుతం 180 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ ఎడమ కాలువ రైతులకు చుక్క నీరు ఇవ్వకపోవడం దారుణమన్నారు. నీళ్లు లేక కాదు.. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ సీజన్‌లో నీటిని విడుదల చేసే అవకాశం పూర్తిగా ఉన్నప్పటికీ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.

నీళ్ల కోసం ధర్నాలు.. ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో వ్యవసాయ రంగం దేశానికే ఆదర్శంగా నిలిచిందని గుర్తుచేశారు. తెలంగాణ అన్నపూర్ణగా, ధాన్య భాండాగారంగా మారిందని చెప్పారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిందని, తెలంగాణ రైస్‌బౌల్‌గా పేరుగాంచిన మిర్యాలగూడ పచ్చని మాగాణాలతో కళకళలాడిందని తెలిపారు. కానీ నేడు అదే ప్రాంతంలో రైతులు తమ పంటలకు నీళ్లు కావాలని ధర్నాలు చేయాల్సిన పరిస్థితి రావడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.

అడ్డగోలుగా హామీలతో మోసం

మిర్యాలగూడ మాత్రమే కాకుండా హుజూర్‌నగర్, నాగార్జునసాగర్, కోదాడ, సూర్యాపేట, నల్లగొండ, నకిరేకల్ సహా సాగర్ ఎడమ కాలువ కింద ఉన్న రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉందన్నారు కేటీఆర్. కేసీఆర్ పాలనలో ధీమాగా వ్యవసాయం చేసిన రైతులు నేడు పంటలు ఎండిపోతుంటే నీళ్లు వస్తాయో రావో తెలియని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని కేటీఆర్ గుర్తుచేశారు. 2 లక్షల రుణమాఫీ, రైతులకు పెరిగిన ఆర్థిక సాయం, కౌలు రైతులకు మద్దతు, పంటలకు బోనస్ వంటి హామీలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు వాటిని విస్మరించిందని ఆరోపించారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి రైతులను మభ్యపెట్టారని మండిపడ్డారు.

కేసీఆర్ పోరాట స్ఫూర్తితో పాదయాత్ర

రైతులు కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే నేడు మోసపోయామని భావించే పరిస్థితి వచ్చిందని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారి కళ్ల ముందే పంటలు ఎండిపోతున్నా స్పందించడం లేదని విమర్శించారు. సాగర్ ఎడమ కాలువ రైతుల సమస్య కోసం 2003లో కేసీఆర్ చేపట్టిన కోదాడ-హాలియా పాదయాత్రను కేటీఆర్ గుర్తుచేశారు. అప్పటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు నీరు విడుదల చేయించడంలో కేసీఆర్ విజయం సాధించారని చెప్పారు. అదే పోరాట స్ఫూర్తితో ఇప్పుడు మరోసారి రైతుల కోసం పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు.

సెప్టెంబర్ 14 డెడ్ లైన్

“సెప్టెంబర్ 14లోపు ఎడమ కాలువకు నీటిని ఎప్పుడు విడుదల చేస్తారు? ఎన్ని తడులకు నీళ్లు ఇస్తారు? ఎంత మేరకు నీరు అందిస్తారు? అనే విషయాలపై స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలి. లేకుంటే వేలాది మంది రైతులతో కలిసి కోదాడ నుంచి హాలియా వరకు నేనే స్వయంగా పాదయాత్ర చేస్తా” అని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు కేటీఆర్. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో సాగర్ ఆయకట్టు రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని వాపోయారు.

వెంటనే నీళ్లు విడుదల చేయాలి

జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు రైతుల ఆవేదనను అర్థం చేసుకుని వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. రైతులను అనిశ్చితిలో ఉంచకుండా పంటలను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు అండగా కేసీఆర్ ఉన్నారని, బీఆర్‌ఎస్ మొత్తం రైతాంగం పక్షాన నిలుస్తుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. అసెంబ్లీలోనూ రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, అక్కడ సమాధానం రాకపోతే ప్రజాక్షేత్రంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. “రైతుల కళ్ల ముందే పంటలు ఎండిపోతుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి. ప్రభుత్వం స్పందించకపోతే కేసీఆర్ స్ఫూర్తితో రైతన్నలతో కలిసి పాదయాత్ర చేసి వారి హక్కుల కోసం పోరాడతాం” అని కేటీఆర్ తేల్చి చెప్పారు.

కేటీఆర్ కు ఘన స్వాగతం

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు, రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు ధర్నాకు వచ్చిన కేటీఆర్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. నల్గొండ నుంచి తిప్పర్తి, మాడుగులపల్లి వేములపల్లి మీదుగా పట్టణ శివారుకు చేరుకున్న కేటీఆర్ కు నార్కెట్ పల్లి అద్దంకి బైపాస్ నుంచి పట్టణంలోని ఎన్ఎస్పీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వరకు భారీ ర్యాలీతో స్వాగతించారు.

వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి