ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో మరో శఖం ముగిసింది. ఆసీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ ‘గ్లెన్ మ్యాక్స్‌వెల్’ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పారు. 14 ఏళ్ల పాటు కొనసాగిన సుదీర్ఘ ఇంటర్నేషనల్ క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వన్డేలు, టెస్టుల నుంచి ఇప్పటికే వైదొలిగిన మ్యాక్స్ వెల్ తాజాగా అంతర్జాతీయ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు.
అయితే, బిగ్ బాష్ లీగ్ (BBL), టీ20 లీగ్‌లలో ఫ్రాంచైజీల తరఫున ఆటగాడిగా కొనసాగుతానని చెప్పారు. 2012లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన మ్యాక్స్‌వెల్ జట్టు కోసం ఎన్నో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆస్ట్రేలియా టీం సాధించిన చారిత్రక విజయాల్లో కీలక పాత్ర పోషించారు. 2015, 2023 వన్డే ప్రపంచకప్‌లతో పాటు 2021లో టీ20 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా నెగ్గడానికి తన వంతు పాత్ర పోషించారు.
పొట్టి ఫార్మాట్‌లో 130 మ్యాచుల్లో 2,897 పరుగులు చేయడంతో పాటు 5 సెంచరీలు నమోదు చేశారు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక శతకాలు బాదిన టీమిండియా మాజీ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు సమవుజ్జీగా నిలిచారు. 2023 ప్రపంచకప్‌లో ఆఫ్గానిస్థాన్‌పై కండరాల నొప్పితోనే 201* (నాటౌట్) పరుగులు సాధించి జట్టును ఒంటిచేత్తో గెలిపించారు.
ఈ అద్భుత ఇన్నింగ్స్ వన్డే చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచింది. మ్యాచ్ ఫలితాన్ని క్షణాల్లో మార్చగల సత్తా ఉన్న ప్లేయర్ మ్యాక్స్ వెల్.. ఆయన తన కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో తోటి ప్లేయర్లు ఆయనకు విషెస్ చెబుతున్నారు. ఆయన ప్రదర్శనను కొనియాడుతున్నారు. అయితే, తన సొంత గ్రౌండ్ మెల్‌బోర్న్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్ అనంతరం వీడ్కోలు పలకాలని మాక్స్‌వెల్ ఆశపడినట్టు సమాచారం. కానీ సెలెక్టర్లు ఎంపిక చేయకపోవడంతో నిరాశతో రిటైర్మెంట్ ప్రకటించినట్టు తెలుస్తోంది.
గత కొంతకాలంగా మ్యాక్స్‌వెల్ పదే పదే గాయాల బారిన పడుతున్నారు. మోకాలి సమస్యలు, కండరాల నొప్పులు తీవ్రతరం కావడంతో అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు శరీరం సహకరించకపోవడం, జట్టు ప్రయోజనాలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.


