తెలంగాణ

అమిత్‌షా క‌రీంన‌గ‌ర్ ప‌ర్య‌ట‌న ర‌ద్దుకు కార‌ణాలివేనా..?

రచన: Kashi6 నిమిషాల పఠనం

ఎక్క‌డ మీటింగ్ పెట్టినా, నిర‌స‌నకారులు వ‌స్తే.. అన‌వ‌స‌రంగా ఘ‌ర్ష‌ణ త‌లెత్తుతుంద‌ని బీజేపీ భావిస్తోంది. కేంద్ర‌మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా విష‌యంలో ఏదో ఒక నిర్ణ‌యం తీసుకునే దాకా ప‌ర్య‌ట‌న‌లు పెట్టుకోక‌పోవ‌డ‌మే మంచిద‌ని నాయ‌కులు భావిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే అమిత్‌షా ప‌ర్య‌ట‌న కూడా ర‌ద్దయిన‌ట్టు తెలుస్తోంది.

కేంద్ర‌మంత్రి అమిత్‌షా క‌రీంన‌గ‌ర్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు

ఆదివారం క‌రీంన‌గ‌ర్ రావ‌ల్సి ఉన్న కేంద్ర‌హోంమంత్రి

ప‌ర్య‌ట‌న ర‌ద్దుకు జెన్ జీ ఉద్య‌మ‌మే కార‌ణ‌మా..?

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా క‌రీంన‌గ‌ర్ ప‌ర్య‌ట‌న ర‌ద్దయింది. ఈ మేర‌కు రాష్ట్ర పార్టీకి స‌మాచారం అందిన‌ట్టు తెలుస్తోంది. ఆదివారం నాడు ఓ ప్రైవేట్ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు అమిత్‌షా క‌రీంన‌గ‌ర్ రావ‌ల్సి ఉంది. పేరుకు ప్రైవేట్ కార్య‌క్ర‌మ‌మే అయినా... పార్టీ శ్రేణులు ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశాయి. ఆ కార్య‌క్ర‌మం ముగిశాక పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో అమిత్‌షా స‌మావేశ‌మ‌వుతార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల‌పై దిశా నిర్దేశం చేస్తార‌ని బీజేపీ నాయ‌కులు భావించారు. ఇందుకోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలో అనూహ్యంగా ఆయ‌న ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకున్నారు. త్వ‌ర‌లోనే మ‌రోసారి క‌రీంన‌గ‌ర్ వ‌స్తార‌ని, కొద్ది రోజుల త‌ర్వాత త‌దుప‌రి తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని బీజేపీ హైక‌మాండ్ రాష్ట్ర పార్టీకి స‌మాచారమిచ్చిన‌ట్టు తెలుస్తోంది.

జెన్‌జీ ఉద్య‌మ‌మే కార‌ణ‌మా..?

ప్ర‌స్తుతం ఢిల్లీలో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఓ పెద్ద ఉద్య‌మ‌మే చేస్తోంది. నీట్ పేపర్ లీకులు, విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు నిర‌స‌న‌గా కేంద్ర విద్యాశాఖా మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌నే డిమాండ్ దేశ‌వ్యాప్తంగా వినిపిస్తోంది. 4-5 రోజులుగా దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు, ర్యాలీలు కొన‌సాగుతున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఉద్య‌మం మొద‌లైంది. ఈ క్ర‌మంలో ప‌లువురు బీజేపీ జాతీయ నాయ‌కులు, కేంద్ర మంత్రులు త‌మ త‌మ ప‌ర్య‌ట‌న‌ల‌ను వాయిదా వేసుకుంటున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. దీనిపై పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న లేక‌పోయినా.. ఇదే వాస్త‌వ‌మ‌ని నాయ‌కులు చెబుతున్నారు.

ఎక్క‌డ మీటింగ్ పెట్టినా, నిర‌స‌నకారులు వ‌స్తే.. అన‌వ‌స‌రంగా ఘ‌ర్ష‌ణ త‌లెత్తుతుంద‌ని బీజేపీ భావిస్తోంది. కేంద్ర‌మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా విష‌యంలో ఏదో ఒక నిర్ణ‌యం తీసుకునే దాకా ప‌ర్య‌ట‌న‌లు పెట్టుకోక‌పోవ‌డ‌మే మంచిద‌ని నాయ‌కులు భావిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే అమిత్‌షా ప‌ర్య‌ట‌న కూడా ర‌ద్దయిన‌ట్టు తెలుస్తోంది.

ఆగ‌స్టు 13 దాకా పార్ల‌మెంటు వ‌ర్ష‌కాల స‌మావేశాలు కొన‌సాగ‌నున్నాయి. అప్ప‌టిదాకా సీజేపీ ఆందోళ‌న‌లు కూడా త‌గ్గే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. పార్ల‌మెంటులో కాంగ్రెస్ స‌హా విప‌క్షాల‌న్నీ కేంద్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ స‌మ‌యంలో కేంద్ర‌మంత్రులు, సీనియ‌ర్ నాయ‌కులు ఢిల్లీలోనే అందుబాటులో ఉండాల‌ని హైక‌మాండ్ నిర్ణ‌యించింద‌ని స‌మాచారం. పార్ల‌మెంటు స‌మావేశం లేని రోజుల్లో కూడా అంద‌రూ ఢిల్లీలోనే ఉండాల‌ని పార్టీ కోరింద‌ట‌. ఏ క్ష‌ణంలో పిలుపొచ్చినా కేంద్ర‌మంత్రుల‌తంతా స‌మావేశం అయ్యేలా అల‌ర్ట్‌గా ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే అమిత్‌షా త‌న ప‌ర్య‌ట‌న‌ను వాయిదా వేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

అమిత్‌షా క‌రీంన‌గ‌ర్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు కావ‌డంతో పార్టీ శ్రేణులు కొంత నిరుత్సాహానికి గుర‌య్యాయి. చాలా రోజుల త‌ర్వాత ఓ సీనియ‌ర్ నేత కరీంన‌గ‌ర్ వ‌స్తుండ‌డంతో.. బీజేపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఉత్సాహంగా ఉన్నారు. అమిత్‌షా రాక కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ప‌ర్య‌ట‌న ర‌ద్దు కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

#Amit Shah#Karimnagar Visit#BJP Telangana#Karimnagar News#Parliament Session#Dharmendra Pradhan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి