స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

Telangana : తప్పు చేసి తప్పించుకోలేరు?

12 నిమిషాల పఠనం

ప్రభుత్వ భూముల విషయంలో స్వేచ్ఛ న్యూస్ దేవేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు రేవంత్ సర్కారును, అధికారులను హెచ్చరిస్తూ వస్తున్నారు. అయినా కూడా వారిలో మార్పు రావడం లేదు. అదే నిర్లక్ష్యం వారిలో కనిపిస్తోంది.ఇప్పుడు వరుసగా హైకోర్టు కలెక్టర్లకు ఇదే అంశంలో చివాట్లు పెడుతుండడంతో ‘స్వేచ్ఛ న్యూస్’ కథనాలపై పెద్దఎత్తున చర్చ మొదలైంది.

-మొన్న నారాయణ రెడ్డి.. ఇప్పుడు మనుచౌదరి

-ఎన్నోసార్లు వార్తలు రాసి హెచ్చరించినా పట్టించుకోలేదు కదయ్యా..

-రూ.లక్షల కోట్ల విలువైన భూములను కాపాడాల్సిన అధికారుల్లో నిర్లక్ష్యం

-పీల్చి పిప్పి చేసిన నారాయణ రెడ్డి

-పట్టించుకోని మను చౌదరి

-ఆయనకేమో జైలు శిక్ష.. ఈయన్ను కోర్టుకు తీసుకురావాలని ఆదేశాలు

-హైకోర్టు ఆర్డర్‌ను సైతం ధిక్కరిస్తున్న వ్యవహారం

-కిందిస్థాయిలో వ్యవస్థను భష్టు పట్టిస్తున్న వైనం

-రంగారెడ్డి,మేడ్చల్ జిల్లాల్లో సీలింగ్, ఇతర భూములపై ‘స్వేచ్ఛ న్యూస్ దేవేందర్ రెడ్డి’ అనేక కథనాలు

-ఎప్పటికప్పుడు కబ్జాలను,అధికారుల తప్పులను హెచ్చరించినా పట్టించుకోని కలెక్టర్లు

-చివరకు హైకోర్టు మొట్టికాయల తర్వాతైనా మారతారా?

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్

9848070809

ప్రభుత్వ భూముల విషయంలో స్వేచ్ఛ న్యూస్ దేవేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు రేవంత్ సర్కారును, అధికారులను హెచ్చరిస్తూ వస్తున్నారు. అయినా కూడా వారిలో మార్పు రావడం లేదు. అదే నిర్లక్ష్యం వారిలో కనిపిస్తోంది.ఇప్పుడు వరుసగా హైకోర్టు కలెక్టర్లకు ఇదే అంశంలో చివాట్లు పెడుతుండడంతో ‘స్వేచ్ఛ న్యూస్’ కథనాలపై పెద్దఎత్తున చర్చ మొదలైంది.ముందుగానే కోర్టు ఆదేశాలను పాటించి ఉన్నా, స్వేచ్ఛ న్యూస్ దేవేందర్ రెడ్డి హెచ్చరికలతో అప్రమత్తం అయినా ఇప్పుడు న్యాయస్థానం ఆగ్రహానికి గురయ్యే వారు కాదు కదా? అని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్ల గురించి రాష్ట్రంలో తెగ మాట్లాడుకుంటున్నారు.

మేడ్చల్ కలెక్టర్ మనుచౌదరిని తీసుకురావాలన్న హైకోర్టు..

ప్రభుత్వ భూములపై నిర్లక్ష్యం వహిస్తుండడంతో తాజాగా హైకోర్టు మేడ్చల్ కలెక్టర్ మను చౌదరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా విచారణకు హాజరు కాకపోవడంతో కోర్టు ఎదుట హాజరుపరచాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి బుధవారం విచారణకు హాజరుకాని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూముల (సీలింగ్ మిగులు భూములు) స్వాధీనంలో నిర్లక్ష్యం, కోర్టు ఆదేశాల అమలులో జాప్యం ఉన్న కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది. గతంలో (08.07.2025) ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ (ఎల్ఆర్టీ) ఆర్డర్‌లు (ఎల్సీసీ నెం.702/ఎం/1975, 18.12.2019) ప్రకారం బాచుపల్లి ప్రాంతంలోని సీలింగ్ మిగులు భూములను రక్షించాలని, సెక్షన్లు 16, 17, అవసరమైతే 19 ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది.

8 వారాల్లో నివేదిక ఇవ్వాలని కూడా చెప్పింది.దీన్ని అమలు చేయడంలో మను చౌదరి నిర్లక్ష్యం చేశారు.దాంతో కంటెంప్ట్ కేసు దాఖలైంది. 27.10.2026న కోర్టు, ఏజీపీ వాదన(భూమి స్వాధీనం చేసుకున్నామని) తర్వాత కలెక్టర్ + ఆర్డీవో/ఎల్ఆర్టీ ఇద్దరూ 11.11.2026న రికార్డులతో హాజరై వివరాలు (ప్రొసీడింగ్స్ ఎప్పుడు మొదలు, ఎప్పుడు ముగించారు, స్వాధీనం ఎప్పుడు, ఏ సెక్షన్ కింద, ప్రస్తుత స్థితి) వివరించాలని స్పష్టంగా ఆదేశించింది.కలెక్టర్ తరపున డిస్పెన్స్ విత్ అప్పీరెన్స్ పిటిషన్ దాఖలు చేశారు (ఎన్నికల విధులు, సర్, భూముల రీసర్వే, మీటింగ్‌ల కారణంగా). కానీ కోర్టు దీన్ని పరిగణించకుండా హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసి, జిల్లా కలెక్టర్‌ను కోర్టు ఎదుట హాజరుపర్చాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది.

గతంలో స్వేచ్ఛ న్యూస్ కథనాలు.. కేసుతో అనుసంధానం

స్వేచ్ఛ న్యూస్ గతంలో బాచుపల్లి ప్రాంతంలోని సీలింగ్ భూ వ్యవహారాలపై వరుసగా ఇన్వెస్టిగేటివ్ కథనాలు ప్రచురించింది.

1. బాచుపల్లి 50 ఎకరాల నిమ్మగడ్డ భూముల వివాదం(నవంబర్ 2026 ప్రారంభం)

1966 నాటి రిజిస్టర్డ్ పత్రాలు, జీపీఏలు, డాక్టర్ రెడ్డీస్/ఐడీపీఎల్‌కు విక్రయాలు వర్సెస్ అన్‌రిజిస్టర్డ్ డీడ్‌లు, మేడ్చల్ కోర్టులో సివిల్ కేసులు, అట్లూరి సుబ్బారావుపై అక్రమ వసూళ్ల ఆరోపణలు. సీఐడీ విచారణ డిమాండ్.

2. బాచుపల్లి / మైరాన్ మాల్ / సీలింగ్ ఫైల్ మాయం సంబంధిత కథనాలు(ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ + స్వేచ్ఛ వార్తలు).

3. బొమ్మరాసిపేట్ / శామీర్‌పేట్ వందల, వెయ్యి ఎకరాల భూ స్కామ్‌లు(ఆగస్టు 2026)

సీలింగ్ డిక్లరేషన్లు, ఫేక్ డాక్యుమెంట్లు, భూ భారతి/ధరణి మాటున పాస్‌బుక్‌ల జారీ, కలెక్టర్ మను చౌదరి + గత కలెక్టర్ అమోయ్ కుమార్ పాత్రపై వరుస పార్ట్‌లు. మంత్రి పొంగులేటి, రెవెన్యూ అధికారులపై ఆరోపణలు. ఈ కేసులో కూడా కోర్టు స్పష్టంగా “సీలింగ్ మిగులు భూమిని (0.5464 ఎస్‌హెచ్ఎస్) డిమార్కేట్ చేసి స్వాధీనం తీసుకోండి, ఆక్రమణలు తొలగించండి” అని ఆదేశించినా, హాజరు + పూర్తి వివరణ ఇవ్వకపోవడం గత స్వేచ్ఛ కథనాల్లో చెప్పిన “రికార్డులు సరిగ్గా పట్టించుకోకపోవడం, జాప్యం” అనే అంశాలకు సరిపోతోంది.

రంగారెడ్డి కలెక్టర్ కూడా ఇంతే..

కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా బేఖాతరు చేసిన వ్యవహారంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఏకంగా హైకోర్టు జైలు శిక్ష విధించింది. రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22ఏ కింద నిషేధిత ఆస్తుల జాబితా నుంచి కొన్ని భూములను తొలగించాలంటూ దాఖలైన వినతిపత్రాన్ని పరిశీలించాలన్న న్యాయస్థాన ఆదేశాలను ధిక్కరించినందుకు ఆయనకు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధిస్తూ జస్టిస్ లక్ష్మణ్ సంచలన తీర్పు వెలువరించారు. కలెక్టర్ వైఖరి ఉద్దేశపూర్వక, స్పష్టమైన కోర్టు ధిక్కారమేనని ధర్మాసనం తేల్చిచెప్పింది.

అయితే, ఈ ఆదేశాలపై అప్పీల్ చేసుకునేందుకు వీలుగా జైలు శిక్ష అమలును నాలుగు వారాల పాటు న్యాయస్థానం సస్పెండ్ చేసింది. 2022 ఆగస్టులో అప్పటి జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయం, సెప్టెంబర్‌లో జిల్లా రిజిస్ట్రార్ జారీ చేసిన మెమోరాండం ప్రకారం వివాదాస్పద భూములకు సంబంధించిన కొన్ని ప్లాట్లను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు అనుమతించారు. పక్కనే ఉన్న ఇతర ప్లాట్లను ఆ జాబితా నుంచి తొలగించినప్పటికీ, తమ భూములపై ఆంక్షలు కొనసాగుతుండటంతో నిరభ్యంతర పత్రాలు ఇవ్వాలని కోరుతూ బాధితులు అధికారులను ఆశ్రయించారు. దీనిపై 60 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని 2025 ఆగస్టులో హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, కలెక్టర్ నారాయణరెడ్డి గడువులోగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

దీంతో విధిలేని పరిస్థితుల్లో బాధితులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. కంటెంప్ట్ దాఖలైన తర్వాతే కలెక్టర్ బాధితులకు నోటీసులు జారీ చేయడం, అనంతరం ఫిబ్రవరి 26న, మళ్లీ జూలై 8న వారి దరఖాస్తులను తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా కలెక్టర్ సమర్పించిన కౌంటర్ అఫిడవిట్‌లోని అంశాలపై న్యాయస్థానం తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. ఆర్డీవో, తహసీల్దార్ల నుంచి నివేదికలు తెప్పించుకుని, విచారణ జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ పేర్కొన్నప్పటికీ, అధికారిక రికార్డులు అందుకు భిన్నంగా ఉన్నాయని కోర్టు గుర్తించింది. ఫిబ్రవరి 21 నాటి విచారణ ప్రొసీడింగ్స్‌లో ఆర్డీవో, తహసీల్దార్, సంబంధిత అధికారుల సంతకాల కాలమ్‌లు ఖాళీగా ఉండటాన్ని ఎత్తిచూపింది.

ఈ క్రమంలో కలెక్టర్ అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలు పచ్చి అబద్ధాలని న్యాయమూర్తి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదంలో ఉన్న నాలుగు సర్వే నెంబర్లలో సర్వే నెంబర్ 537ను నిషేధిత జాబితా నుంచి తొలగించి, మిగిలిన 536, 657, 658 సర్వే నెంబర్లను మాత్రం ఆంక్షల్లోనే ఉంచడంపై అధికారుల ద్వంద్వ వైఖరిని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. కోర్టు ఉత్తర్వులు తెలిసినప్పటికీ, అమలు చేసేందుకు తగినంత గడువు లభించినా కలెక్టర్ ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేశారని నిర్ధారించింది. బాధితుల హక్కులను కాలరాస్తూ, న్యాయవ్యవస్థ ఆదేశాలను నిర్లక్ష్యం చేసిన తీరును తీవ్రంగా పరిగణిస్తూ కలెక్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష ఖరారు చేసింది. రంగారెడ్డి కలెక్టర్ తీరుపైనా ముందే స్వేచ్ఛ న్యూస్ పలు కథనాలను ఇచ్చింది.‘ఏమిటీ సర్వాంతర్యామి లీలలు’, ‘నారాయణ.. రంగారెడ్డిని పిప్పి పిల్చేశావు కదయ్యా’ అంటూ వార్తలు ప్రచురించింది. రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పుడుతున్నా పట్టించుకోని తీరును ఎండగట్టింది. అయినా, కూడా నారాయణ తీరు మార్చుకోలేదని కోర్టు ఉత్తర్వుల తర్వాత అంతా చర్చించుకుంటున్నారు.

#government lands#highcourt#collecter manu chowdari#narayanareddy#swechaanews#negligence#sealing lands grab
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి