తెలంగాణ

Beerla Ilaiah: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు రైతన్నల నిరసన సెగ

3 నిమిషాల పఠనం

ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు రైతన్నల నుంచి నిరసన సెగ ఎదురైంది. ఆలేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో గోదామును ప్రారంభించేందుకు వచ్చిన బీర్ల ఐలయ్యపై రైతులు మండిపడ్డారు.

Beerla Ilaiah: ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు రైతన్నల నుంచి నిరసన సెగ ఎదురైంది. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం జాప్యం చేస్తోందని రైతులు ఆరోపించారు. ఆలేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో గత ప్రభుత్వం నిర్మించిన గోదామును ప్రారంభించేందుకు వచ్చిన బీర్ల ఐలయ్యను రైతులు గట్టిగా నిలదీశారు. 20 రోజులుగా వడ్లు తడుస్తూ, ఎండుతూ ఉన్నా కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లు ఎందుకు కొనడం లేదంటూ బీర్ల ఐలయ్యను వారు ప్రశ్నించారు. ఎప్పటినుంచి ధాన్యం కొనుగోలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

నేనే 10మందికి అన్నం పెడతా అంటూ రైతు సమాధానం

రైతులు అలా నిలదీయడంతో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య షాక్ తిన్నారు. ఏం చెప్పాలో తెలియక నీళ్లు నమిలారు. కాసేపటి తర్వాత.. భోజనం చేద్దాం రండి అంటూ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రైతులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన ఓ రైతు.. నేనే 10 మందికి అన్నం పెడతాను అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. అంతేకాదు మీ మర్యాదలు మాకు అవసరం లేదని తేల్చి చెప్పాడు. ఈ అనూహ్య పరిణామంతో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విస్తుపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ధాన్యం కొనుగోళ్లు ఎప్పుడు?

20 రోజులుగా ప్రతిరోజూ ధాన్యాన్ని ఎండబోస్తూ, కుప్పపోస్తూ ఇంటికి వెళ్లి వస్తున్నామని రైతులు వాపోయారు. కనీసం తేమ చూసేందుకు సూపర్ వైజర్ రావడం లేదని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముందు గోడు వెళ్లబోసుకున్నారు రైతులు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోళ్లపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

#ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు రైతన్నల నుంచి నిరసన సెగ ఎదురైంది. ఆలేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో గోదామును ప్రారంభించేందుకు వచ్చిన బీర్ల ఐలయ్యపై రైతులు మండిపడ్డారు.
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి