Telangana Excise Department: ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురిపించే తెలంగాణ ఎక్సైజ్ శాఖలో ఇప్పుడు అసలు సిసలైన లెక్కల వేట మొదలైంది. అక్రమ మద్యం రవాణాను అడ్డుకోవాల్సిన కొందరు అధికారులే అక్రమార్కులతో చేతులు కలిపి, పట్టుబడిన సరుకులో చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఆ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బాటిళ్ల లెక్కల్లో మాయాజాలం, ముడుపుల వాటాల వ్యవహారం ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) దృష్టికి వెళ్లడంతో, ఇప్పుడు ఆ గుట్టుమట్లన్నీ బయటకు తీసే పనిలో ఉన్నతాధికారులు బిజీగా ఉన్నారు.
సీఎంఓ ఆరా.. కమిషనర్ ఫైర్!
కొందరు అధికారుల అవినీతి వ్యవహారాలపై సీఎంఓ నుంచి నేరుగా వివరణ కోరుతూ ప్రశ్నలు ఎదురవుతుండటంతో ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు కొందరు చేస్తున్న తప్పులకు తాను సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే సంబంధిత అధికారులను పిలిపించి గట్టిగానే క్లాస్ తీసుకున్న కమిషనర్, పద్ధతి మార్చుకోకపోతే వేటు తప్పదని సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
రికార్డుల్లో తక్కువ.. పక్కదారి పడుతున్న సరుకు ఎక్కువ?
ఈ వ్యవహారంలో సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల పరిధిలో సాగుతున్న అక్రమ మద్యం దందా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో తక్కువ ధరకు దొరికే మద్యాన్ని రైళ్ల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్‌కు తీసుకొచ్చి, ఇక్కడ అధిక ధరలకు అమ్ముతూ అక్రమార్కులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ రవాణాను అడ్డుకోవాల్సిన కొందరు ఎక్సైజ్ సిబ్బందే అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఇక్కడే అసలు మాయాజాలం జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాడుల్లో పట్టుబడిన లిక్కర్ బాటిళ్లను పూర్తిస్థాయిలో చూపించకుండా, రికార్డుల్లో తక్కువగా నమోదు చేస్తూ మిగతా సరుకును పక్కదారి పట్టిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ గోల్‌మాల్‌లో కేవలం కింది స్థాయి సిబ్బంది మాత్రమే కాకుండా, ఎక్సైజ్ స్టేషన్ల స్థాయి అధికారుల నుంచి ఎక్సైజ్ సూపరింటెండెంట్ల వరకు కొందరి పాత్రపై ఫిర్యాదులు అందడం కలకలం రేపుతోంది.
ఆ వాటాల లెక్కలన్నీ బయటకు తీస్తున్నారా?
కర్ణాటక మద్యం విక్రయాల ద్వారా వచ్చే భారీ లాభాల్లో కొంత భాగాన్ని, తమకు సహకరిస్తున్న ఎక్సైజ్ అధికారులకు ముడుపులుగా అందిస్తున్నట్లు కమిషనర్ దృష్టికి వచ్చింది. దీంతో ఈ అక్రమ దందా లెక్కలు ఏంటి? ఎవరికి ఎంత వాటా అందుతోంది? అన్న వివరాలపై కమిషనర్ హరికిరణ్ లోతుగా కూపి లాగుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, రైల్వే స్టేషన్ల పరిధిలో పట్టుబడుతున్న మద్యం బాటిళ్ల గోల్‌మాల్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. లోతుగా ఎంక్వైరీ చేస్తే ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అసలు సూత్రధారులు ఎవరు, దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు అన్నది పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. మరి కమిషనర్ తీస్తున్న ఈ లెక్కలతో అవినీతి అధికారుల గుట్టు రట్టవుతుందా, లేదా అన్నది వేచి చూడాలి.


