ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ (వీసీ) అల్దాస్ జానయ్యకు బిగ్ షాక్ తగిలింది.ఆయన మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తనను వీసీ జానయ్య లైంగికంగా వేధించారని ఓ మహిళా ప్రొఫెసర్ కన్నీరు పెట్టుకోవడంతో పాటు మీడియాకు అసలు విషయాన్ని వివరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మీద చర్యలు తీసుకోవాలని వర్సిటీలో విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆందళనకు దిగారు.
ఈ క్రమంలోనే లైంగిక వేధింపుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని గవర్నర్ శవప్రతాప్ శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. గవర్నర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ కె.లక్ష్మీ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేయగా.. అందులో ఐఏఎస్ అధికారులు గోపి, రాహుల్ రాజ్, ‘ప్రజ్వల’ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సునీతా కృష్ణన్ సభ్యులుగా ఉన్నారు.
ఈ లైంగిక వేధింపుల కేసుపై లోతుగా విచారణ జరిపి 15 రోజుల్లోగా సమగ్ర నివేదికను అందజేయాలని, బాధిత మహిళా ప్రొఫెసర్ భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదిలాఉండగా, తనను లైంగికంగా వేధించిన వీసీ జానయ్య మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి ఫిర్యాదు చేసి 15 రోజులు దాటినా ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని బాధితురాలు ఆరోపించారు.
నిందితుడిని ప్రభుత్వ పెద్దలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని బాధిత మహిళా ప్రొఫెసర్ ఆరోపించారు. వర్సిటీలో మహిళా ప్రొఫెసర్‌కు న్యాయం చేయాలని విద్యార్థులు,ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగారు.చివరకు గవర్నర్ జోక్యంతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా, ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్ సైతం విచారణను వేగవంతం చేసింది. విచారణకు హాజరు కావాలని వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్యను మహిళా కమిషన్ ఆదేశించింది. దీంతో ఆయన ఇవాళ కమిషన్ ఎదుట హాజరు కానున్నారు.అయితే,తనను కావాలనే టార్గెట్ చేశారని అల్దాస్ జానయ్య సైతం కౌంటర్ ఎటాక్ చేశారు.


