యూపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి.వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక ప్రకటన చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన ‘సామాజిక పరివర్తన మోర్చా’ (SPM) తరఫున యూపీ సీఎం అభ్యర్థిగా ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్‌ను అధికారికంగా ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే గురువారం యూపీ రాజధాని లక్నోలో చంద్రశేఖర్ ఆజాద్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.యూపీలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ కూటమి ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. యూపీలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించకుండా అడ్డుకోవడానికి తమ కూటమి ఓ బలమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని పూర్తి విశ్వాసంతో చెబుతున్నానని అన్నారు.
దళితులు, వెనుకబడిన తరగతులు, అణగారిన వర్గాలను గతంలో అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలకతీతంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసమే తమ సామాజిక పరివర్తన మోర్చా పనిచేస్తుందన్నారు.
యూపీలో విద్యావ్యవస్థ పూర్తిగా క్షీణించిందని, యువతలో నిరుద్యోగం, రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను తమ కూటమి ప్రధాన ఎజెండాగా తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో సామాజిక మార్పు కోసం జరిగే ఉద్యమానికి నాంది పలుకుతూ నవంబర్ 26న నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. బీజేపీ, ఇతర పార్టీలు గతం గురించే మాట్లాడుతుంటే తమ ‘సామాజిక పరివర్తన మోర్చా’ మాత్రం భవిష్యత్ రాజకీయాలపై దృష్టి సారిస్తుందని ఓవైసీ వెల్లడించారు.


