ఏఐ(AI) (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికతకు మానవత్వం తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చని మహారాష్ట్రలో జరిగిన ఒక హృదయస్పర్శి ఘటన నిరూపించింది. మానసిక అస్వస్థత కారణంగా రెండేళ్లన్నర క్రితం ఇంటి నుంచి తప్పిపోయిన ఒక వివాహిత, గూగుల్ సెర్చ్, చాట్‌జీపీటీ (ChatGPT) వంటి డిజిటల్ సాధనాల సహాయంతో తిరిగి తన కుటుంబ సభ్యుల చెంతకు చేరుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సేవాభావంతో మేళవించి ఓ స్వచ్ఛంద సంస్థ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని పర్భణీ జిల్లాకు చెందిన 45 ఏళ్ల జులేఖా ముఖీద్ షేక్, తీవ్ర మానసిక ఒత్తిడికి గురై రెండేళ్లన్నర క్రితం తన ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత దారితప్పి ముంబై చేరుకున్న ఆమెను కోలాబా పోలీసులు, చెంబూరులోని ప్రభుత్వ మహిళా ఆశ్రయ కేంద్రం అధికారులు గుర్తించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు 2024 ఏప్రిల్ 3వ తేదీన ఆమెను సింధుదుర్గ్ జిల్లాలోని 'సంవిత ఆశ్రమం'లో చేర్పించారు.
ఆశ్రమంలో చికిత్స పొందుతున్న జులేఖా కుటుంబ సభ్యుల ఆచూకీని ఎలాగైనా కనుగొనాలని 'జీవన్ ఆనంద్ సంస్థ' ట్రస్టీ కిసాన్ చౌరే, ఆయన సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆశ్రమ సిబ్బంది జులేఖాతో ఎంతో ఓపికగా, ఆప్యాయంగా మాట్లాడుతూ ఆమె గతం, కుటుంబ నేపథ్యం గురించి చిన్న చిన్న ఆధారాలను రాబట్టారు. ఆమె చెప్పిన కొన్ని ప్రాంతాల పేర్లు, ఇతర వివరాలను ఆధారంగా చేసుకుని గూగుల్ సెర్చ్, చాట్‌జీపీటీ ఏఐ టూల్స్ సాయంతో విశ్లేషించగా, ఆమె స్వస్థలం పర్భణీ జిల్లా అని కచ్చితంగా నిర్ధారణ అయింది.
వెంటనే అక్కడి నిర్భయ పోలీస్ స్క్వాడ్ అధికారులను సంప్రదించిన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, వారి సహకారంతో జులేఖా బంధువుల ఆచూకీని గుర్తించారు. రెండేళ్లన్నర సుదీర్ఘ విరామం తర్వాత ఫోన్లో తన కుటుంబ సభ్యుల గొంతు వినగానే జులేఖా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సమాచారం అందుకున్న ఆమె భర్త ముఖీద్ షేక్ నవంబర్ 9న సంవిత ఆశ్రమానికి చేరుకుని, భావోద్వేగ వాతావరణంలో తన భార్యను తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. ఆమెతో ఎంతో సహనంతో మాట్లాడి వివరాలు సేకరించడం, దానికి చాట్‌జీపీటీ వంటి ఆధునిక డిజిటల్ సాధనాలను జోడించడం వల్లే విడిపోయిన కుటుంబాన్ని తిరిగి కలపగలిగామని కిసాన్ చౌరే సంతృప్తి వ్యక్తం చేశారు.


