పబ్ జీ గేమ్ ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేసింది. ఈ గేమ్‌కు దేశంలోని యువతీయువకులు, విద్యార్థులు అడిక్ట్ అవుతున్నారని తెలిసి కేంద్రప్రభుత్వం కొంతకాలం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని కఠిన ఆంక్షలు విధించి మరల అనుమతి ఇచ్చింది. అయితే, పబ్ జీ గేమ్ తాజాగా ఓ హత్యకు కారణమైంది. ఈ గేమ్ ఆడుతుండగా ఓ వ్యక్తికి ఇద్దరు యువతులు పరిచయం అయ్యారు. ఇద్దరితో ప్రేమాయణం సాగించిన సదరు వ్యక్తి ఒకరు బ్రేకప్ చెప్పడంతో కోపం పెంచుకున్నాడు.అనంతరం ప్లాన్ ప్రకారం ఆమెను అంతమొందించాడు.ఈ ఘటన పశ్చిమబెంగాల్లో చోటుచేసుకుంది.
వివరాల్లోకివెళితే.. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని బారానగర్‌కు చెందిన ధరమ్ వీర్ రెగ్యులర్‌గా పబ్ జీ గేమ్ ఆడేవాడు.అంజలి షా (26) అనే యువతి సైతం పబ్జీ గేమ్ ఆడుతుండగా వీరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది.మూడేళ్లుగా వీళ్లు ప్రేమించుకుంటుండగా ధరమ్ వీర్‌కు అదే పబ్జీ గేమ్ ద్వారా మరో యువతి పరిచయమైంది. ఆమెకు ధరమ్ వీర్ దగ్గరవ్వడం చూసి అంజలి షా అతడిని నిలదీసింది.
ఈ విషయమై గొడవలు జరిగాయి. అంజలి బ్రేకప్ చెప్పడంతో ధరమ్ వీర్ ఆమెను చంపాలని ప్లాన్ వేశాడు.కోల్‌కతాలో ఓ గెస్ట్ హౌస్ తీసుకొని మాట్లాడుదామనే నెపంతో అంజలిని కలిశాడు. అక్కడ కూడా ఇద్దరి మధ్య గొడవ జరగడంతో యువతి నెత్తిపై బలమైన వస్తువుతో బాది, గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం ఆమె ఉంటున్న ఫ్లాట్‌లోని బంగారం, ఫోన్, ఇతర విలువైన వస్తువులు దొంగిలించి పరారయ్యాడు.
అంజలి హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ధరమ్ వీర్ గురించి తెలుసుకుని అతన్ని వెతకడం ప్రారంభించారు. అయితే, కేసుని తప్పుదోవ పట్టించేందుకు అంజలి ఫోన్ తీసుకెళ్లిన నిందితుడు..పలు స్టేషన్లు మారుతూ ప్రయాణాలు సాగించాడు. చివరగా అతడు ఢిల్లీకి చేరుకోగా నవంబర్ 12న పోలీసులు ధరమ్ వీర్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం బెంగాల్ తరలించినట్టు సమాచారం. బాధిత యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.


