తెలంగాణ

తుది దశకు ‘ఫోన్ ట్యాపింగ్’ కేసు.. కేసీఆర్, కేటీఆర్‌లకు బిగుస్తున్న ఉచ్చు?

5 నిమిషాల పఠనం

తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్’ కేసు దర్యాప్తు అత్యంత కీలకమైన తుది దశకు చేరుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)ను ప్రధాన నిందితుడిగా (A1), ఆయన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)ను రెండో నిందితుడిగా (A2) పేర్కొంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తుది ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

  • ఏ1గా కేసీఆర్, ఏ2గా కేటీఆర్ పేర్లతో తుది ఛార్జ్‌షీట్?

  • కీలక విభాగాల్లో అనుకూల అధికారుల నియామకం, అక్రమ నిఘా

  • ఎలక్టోరల్ బాండ్ల వసూళ్లపై రియల్ ఎస్టేట్ వ్యాపారి కీలక వాంగ్మూలం

  • పటిష్ఠమైన అభియోగపత్రం కోసం సుప్రీంకోర్టు న్యాయనిపుణుల సలహాలు

  • ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రైవేట్ వ్యక్తుల పాత్రపైనా సిట్ గురి

  • దర్యాప్తు వివరాలు లీక్ కావడంపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం

 తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్’ కేసు దర్యాప్తు అత్యంత కీలకమైన తుది దశకు చేరుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)ను ప్రధాన నిందితుడిగా (A1), ఆయన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)ను రెండో నిందితుడిగా (A2) పేర్కొంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తుది ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

 నిబంధనలకు విరుద్ధమని తెలిసినప్పటికీ ఫోన్ ట్యాపింగ్‌కు అనుమతులు ఇవ్వడంతో పాటు, తమకు అనుకూలంగా ఉండే అధికారులను ఇంటెలిజెన్స్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) వంటి కీలక విభాగాల్లో నియమించి ఈ అక్రమాలకు పాల్పడ్డారని సిట్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలతో పాటు పలువురు సినీ సెలబ్రిటీల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేయడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది.

 ఈ దర్యాప్తు పురోగతిపై సిట్ ఉన్నతాధికారులు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి సమగ్రంగా వివరించినట్లు సమాచారం. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా వందలాది మంది బాధితుల వాంగ్మూలాలను, పక్కా ఫోరెన్సిక్, సాంకేతిక ఆధారాలను దర్యాప్తు బృందం సేకరించింది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన రహస్య సమాచారంతో బెదిరింపులకు పాల్పడి, ఎలక్టోరల్ బాండ్ల రూపంలో భారీ విరాళాలు వసూలు చేశారన్న ఆరోపణలకు సంబంధించి ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసులో అత్యంత కీలక ఆధారంగా మారనుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

 న్యాయస్థానంలో ఛార్జ్‌షీట్ వీగిపోకుండా అత్యంత పటిష్ఠంగా రూపొందించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయనిపుణుల సలహాలను కూడా సిట్ అధికారులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ తుది నివేదికలో కేసీఆర్‌ను ప్రధాన సూత్రధారిగా పేర్కొంటూనే, మావోయిస్టుల నిఘా పేరిట రాజకీయ నాయకులు, ప్రముఖుల ఫోన్ నంబర్ల ట్యాపింగ్‌కు అనుమతులు మంజూరు చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఈ వ్యవహారంలో సహకరించిన ప్రైవేటు వ్యక్తుల పేర్లను కూడా నిందితుల జాబితాలో చేర్చనున్నట్లు సమాచారం.

 మరోవైపు, ఈ కేసుకు సంబంధించిన అత్యంత గోప్యమైన దర్యాప్తు వివరాలు ఎప్పటికప్పుడు బయటకు పొక్కుతుండటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల పోలీసు ఉన్నతాధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తుది ఛార్జ్‌షీట్ దాఖలైతే తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పెను దుమారం చెలరేగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

#TelanganaPhoneTappingCase2026#KCRKTRPhoneTappingChargesheet#SITFinalChargesheetTelangana#ElectoralBondsPhoneTapping#TelanganaPoliticsLatestNews#HydNewsTelugu#CrimeNewsTelugu#BreakingNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి