National

సింఘమ్ నెట్‌వర్క్.. భారత్‌లో ఏం జరుగుతోంది? ఎవరీ నెవిల్ రాయ్?

రచన: Kashi•••13 నిమిషాల పఠనం

వందల మిలియన్ డాలర్ల వ్యాపారం. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సంస్థలతో సంబంధాలు. చైనా కేంద్రంగా సాగుతున్న కార్యకలాపాలపై ఆరోపణలు. భారత్‌లో ఒక డిజిటల్ న్యూస్ సంస్థ చుట్టూ చెలరేగిన వివాదం... ఇప్పుడు రాజకీయ నిరసనలు, విదేశీ ప్రభావం, క్రిప్టోకరెన్సీ, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వరకు వెళ్లింది. ఈ పరిణామాలన్నింటి మధ్య మరోసారి వినిపిస్తున్న పేరు నెవిల్ రాయ్ సింఘమ్.

భారత్‌పై అదృశ్య దాడి..!

ఎవరీ నెవిల్ సింఘమ్?

నిధుల వెనుక అసలు కథంటి..?

భారత్‌లో అస్థిరతకు కుట్రనా?

ప్రపంచంలోనే టాప్ టెక్నోక్రాట్. వందల మిలియన్ డాలర్ల వ్యాపార నేపథ్యం. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సామాజిక, రాజకీయ సంస్థలతో సంబంధాలు. చైనా కేంద్రంగా సాగుతున్న కార్యకలాపాలపై ఆరోపణలు. భారత్‌లో ఒక డిజిటల్ న్యూస్ సంస్థ చుట్టూ చెలరేగిన వివాదం... ఇప్పుడు రాజకీయ నిరసనలు, విదేశీ ప్రభావం, క్రిప్టోకరెన్సీ, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వరకు వెళ్లింది. ఈ పరిణామాలన్నింటి మధ్య ఇప్పుడు మరోసారి వినిపిస్తున్న పేరు నెవిల్ రాయ్ సింఘమ్.

అసలు ఈయన ఎవరు? ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీని నడిపిన వ్యక్తి పేరు భారత రాజకీయాల్లో ఇంత పెద్ద చర్చకు ఎందుకు దారితీసింది? విదేశీ నిధులు, మీడియా సంస్థలు, చైనా సంబంధాలపై వచ్చిన ఆరోపణల్లో అసలు కథేంటి? భారత్‌లో జరుగుతున్న నిరసనల వెనుక విదేశీ నెట్‌వర్క్‌లు ఉన్నాయన్న వాదనకు ఆధారాలున్నాయా?

ఇది కేవలం ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిన కథ కాదు. ప్రపంచవ్యాప్తంగా డబ్బు, మీడియా, రాజకీయ భావజాలం ఎలా ఒకదానితో మరొకటి ముడిపడుతున్నాయనే ప్రశ్నను కూడా ముందుకు తెస్తున్న వ్యవహారం.

టెక్నాలజీ వ్యాపారం నుంచి అంతర్జాతీయ నెట్‌వర్క్‌ల వరకు

నెవిల్ రాయ్ సింఘమ్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఆయన వ్యాపార నేపథ్యాన్ని చూడాలి. సింఘమ్ అమెరికాలో పుట్టిన టెక్నాలజీ వ్యాపారవేత్త. థాట్‌వర్క్స్ అనే సాఫ్ట్‌వేర్ కన్సల్టింగ్ కంపెనీని స్థాపించి, దాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. 2017లో ఆ సంస్థను అమ్మేశారు. ఆ ఒప్పందం విలువ సుమారు 785 మిలియన్ డాలర్లని అప్పట్లోనే వార్తలొచ్చాయి.

ఒక్కసారి ఆలోచించండి. ఒక టెక్నాలజీ కంపెనీని నిర్మించి, భారీ మొత్తానికి అమ్మేసిన వ్యక్తి. ఆ తర్వాత తన సంపదలో కొంత భాగాన్ని సామాజిక, రాజకీయ కార్యకలాపాలకు వినియోగించాలని నిర్ణయించుకున్న వ్యక్తి. ఇక్కడి వరకు చూస్తే ఇందులో అసాధారణంగా కనిపించేది ఏమీ లేదు. కానీ అసలు చర్చ ఆయన సంపద గురించి కాదు. ఆ డబ్బు ఎక్కడికి వెళ్తోంది, ఎవరికి చేరుతోంది, ఆ సంస్థలు ఏం చేస్తున్నాయన్నదే అసలు ప్రశ్న.

సింఘమ్‌కు సంబంధించిన నిధుల నెట్‌వర్క్‌లు, చైనా ప్రభుత్వ ప్రచార కథనాలకు అనుకూలమైన సందేశాలను అంతర్జాతీయంగా వ్యాప్తి చేస్తున్నాయనే ఆరోపణలను అమెరికాకు చెందిన టాప్ మీడియా ఏజెన్సీలే తెరపైకి తెచ్చాయి. నిధులు అందుకున్న సంస్థలు, వాటి మధ్య సంబంధాలు, వాటి ప్రచార కార్యకలాపాలను ఇందులో రాసుకొచ్చాయి మీడియా ఏజెన్సీలు.

చైనా పేరు ఎందుకు వినిపిస్తోంది?

సింఘమ్ ప్రస్తుతం చైనాలోని షాంఘైలో ఉంటున్నట్టు తెలుస్తోంది. చైనాకు అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనకు సంబంధించిన అంతర్జాతీయ నెట్‌వర్క్‌లపై కూడా దృష్టి పడింది. వాస్తవానికి ఈ రోజుల్లో ప్రభావం చూపడానికి సరిహద్దులు దాటాల్సిన అవసరం లేదు. ఒక వీడియో, ఒక సోషల్ మీడియా ప్రచారం, ఒక వైరల్ పోస్ట్ చాలు. ప్రపంచంలోని ఒక మూలలో మొదలైన చర్చ మరో దేశంలో రాజకీయ వివాదంగా మారడానికి.

స్‌క్లిక్ వివాదం.. భారత్‌లో సింఘమ్ పేరు ఎలా మార్మోగింది?

సింఘమ్ పేరు భారతదేశంలో విస్తృతంగా చర్చకు రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి న్యూస్‌క్లిక్ వ్యవహారం. 2023 ఆగస్టులో న్యూయార్క్ టైమ్స్ పబ్లిష్ చేసిన ఇన్వెస్టిగేషన్ స్టోరీ, సింఘమ్‌కు సంబంధించిన నిధుల నెట్‌వర్క్ నుంచి న్యూస్‌క్లిక్‌కు నిధులు అందాయని స్పష్టంగా చెప్పింది. ఆ నిధుల నెట్‌వర్క్ చైనా అనుకూల ప్రచారంతో సంబంధం కలిగి ఉందని కూడా ఆరోపించింది. అంతే దీనిపై భారత రాజకీయాల్లో తీవ్ర వివాదం మొదలైంది. న్యూస్‌క్లిక్‌కు అందిన విదేశీ పెట్టుబడులు, వాటి వినియోగం, ఆ సంస్థ పబ్లిష్ చేసిన వార్తల వెనుక ఏదైనా విదేశీ ప్రభావం ఉందా అనే అంశాలపై ప్రశ్నలు లేవనెత్తారు.

2020లోనే న్యూస్‌క్లిక్ పై విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల ఉల్లంఘన, ఇతర ఆర్థిక నేరాలకు సంబంధించి కేసు నమోదైంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా మనీలాండరింగ్ ఆరోపణలతో దర్యాప్తు చేపట్టింది. అయితే, ఇక్కడ మరో కీలకమైన ట్విస్ట్ ఉంది.

2026 మే 29న ఢిల్లీ హైకోర్టు న్యూస్‌క్లిక్, దాని వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థకు సంబంధించిన 2020 నాటి ఆర్థిక నేరాల కేసులో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను, దాని ఆధారంగా సాగిన ఈడీ చర్యలను కొట్టివేసింది. ఆ కేసులో ఆరోపణలు క్రిమినల్ నేరాన్ని నిరూపించడానికి సరిపోవని కోర్టు అభిప్రాయపడింది.

అయితే, న్యూస్‌క్లిక్‌కు సంబంధించిన అన్ని కేసులూ ముగిసిపోయాయని అనుకోవడం కూడా తప్పే. ముఖ్యంగా యూఏపీఏ కింద నమోదైన వేరే కేసు ఈ తీర్పుతో ఆటోమేటిక్‌గా ముగియలేదు. ఈడీ కూడా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి.

రాజకీయాల్లో ఎందుకీ ప్రకంపనలు?

ఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారడానికి బీజేపీ నాయకుల కామెంట్సే కారణం. ఆ పార్టీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన ఆరోపణలతో ఈ వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది.

రాహుల్ గాంధీ, విదేశీ వ్యక్తులు, అంతర్జాతీయ సంస్థలు, నెవిల్ రాయ్ సింఘమ్‌కు సంబంధించిన నెట్‌వర్క్‌ల మధ్య సంబంధాలున్నాయంటూ దూబే ప్రశ్నలు లేవనెత్తారు. క్రిప్టోకరెన్సీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ రంగాలకు సంబంధించిన వ్యక్తులు రాజకీయ కార్యకలాపాలను ప్రభావితం చేస్తున్నాయన్న ఆరోపణలనూ ఆయన ప్రస్తావించారు. భారత్‌లో నిరసనలు, యువత ఉద్యమాలు, ప్రతిపక్ష రాజకీయాల వెనుక విదేశీ ప్రభావం ఉందనే కోణంలో కూడా ఆయన మాట్లాడారు.

విదేశీ నిధులు.. ప్రజాభిప్రాయంపై ప్రభావం చూపే గేమ్ ఉందా?

ఇప్పుడు ఈ కథలో అత్యంత ముఖ్యమైన అంశం ఇదే. ఒక దేశం నుంచి మరో దేశంలోని సంస్థలకు డబ్బు వెళ్తుంది. ఆ సంస్థలు మీడియా, సామాజిక కార్యక్రమాలు, రాజకీయ చర్చలు లేదా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటాయి. ఇందులో చట్టబద్ధమైన కార్యకలాపాలూ ఉండొచ్చు. చట్టాలను ఉల్లంఘించే వ్యవహారాలూ ఉండొచ్చు.

అందుకే విదేశీ నిధుల మూలం, వాటి వినియోగం, వాటి వెనుక ఉన్న ఉద్దేశం గురించి ప్రశ్నించడం తప్పు కాదు. కానీ ఒక సంస్థకు విదేశీ నిధులు అందాయనే కారణంతో అది దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని తేల్చేయలేం.

అదే సమయంలో, విదేశీ నిధుల ద్వారా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నాలు జరిగే అవకాశం లేదని కూడా అనలేం. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ప్రచారం, ఆన్‌లైన్ ప్రభావ కార్యకలాపాలు, తప్పుడు సమాచార వ్యాప్తిపై ప్రభుత్వాలు, పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

అసలు సవాల్ ఇక్కడే ఉంది. స్వతంత్ర మీడియా, సామాజిక సంస్థల స్వేచ్ఛను కాపాడుతూనే, చట్టవిరుద్ధమైన విదేశీ జోక్యం ఉంటే దాన్ని ఆధారాలతో బయటపెట్టడం ఎలా? ఇదే ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎదుర్కొంటున్న పెద్ద ప్రశ్న.

భారత్‌లో అస్థిరతకు నిజంగానే స్కెచ్ వేశారా?

నెవిల్ రాయ్ సింఘమ్‌కు సంబంధించిన అంతర్జాతీయ నిధుల నెట్‌వర్క్‌లపై ఆరోపణలు ఉన్నాయి. న్యూస్‌క్లిక్ వ్యవహారం ఉంది. చైనా అనుకూల ప్రచారంపై పరిశోధనాత్మక కథనాలు ఉన్నాయి. తాజాగా రాజకీయ నాయకులు విదేశీ ప్రభావం, నిరసనలు, ప్రతిపక్షాల కార్యకలాపాలను కలుపుతూ ఆరోపణలు చేస్తున్నారు.

కానీ ఈ అంశాలన్నింటినీ కలిపి భారత్‌లో అస్థిరత సృష్టించేందుకు ఒక నిర్దిష్ట కుట్ర పన్నారని తేల్చాలంటే మరింత స్పష్టమైన ఆధారాలు కావాలి. ఎవరు డబ్బు ఇచ్చారు? ఎవరు తీసుకున్నారు? ఏ కార్యక్రమానికి ఖర్చు చేశారు? ఏదైనా రాజకీయ ఉద్యమాన్ని నడిపించేందుకు ఆదేశాలు ఇచ్చారా? ఏదైనా విదేశీ ప్రభుత్వానికి ఈ వ్యవహారంతో ప్రత్యక్ష సంబంధం ఉందా? ఈ ప్రశ్నలకు ఆర్థిక లావాదేవీలు, విశ్వసనీయ సాక్ష్యాలు, దర్యాప్తు ఫలితాలు సమాధానం చెప్పాల్సి ఉంది.

ఎందుకంటే దేశ భద్రత అనేది రాజకీయ ఆరోపణలకే పరిమితమయ్యే అంశం కాదు. అదే సమయంలో దేశ భద్రత పేరుతో ఆధారాలు లేని ఆరోపణలను నిజాలుగా ప్రచారం చేయడం కూడా ప్రమాదకరమే. నెవిల్ రాయ్ సింఘమ్ వ్యవహారం మన ముందుకు తెచ్చిన అసలు ప్రశ్న ఇదే. అంతర్జాతీయ నిధుల నెట్‌వర్క్‌లు నిజంగా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తున్నాయా? అలా జరిగితే వాటిని ఎలా గుర్తించాలి? ఆరోపణలకు, నిరూపితమైన నేరాలకు మధ్య ఉన్న గీతను ఎలా కాపాడాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికితేనే సింఘమ్ నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు కథ.. స్పష్టమవుతుంది.

#Neville Roy Singham#Neville Roy Singham Network#NewsClick Case#China India Relations#Foreign Funding India#India Political News#NewsClick Controversy#China Influence#Indian Politics#Political Analysis#International Network#India News#Foreign Influence Allegations#Special Focus#Investigative Journalism
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి