రాష్ట్రంలో రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ వారికి ఒకటో తారీఖున జీతాలు ఇచ్చిన ప్రభుత్వం తమదని కాంగ్రెస్ పార్టీ గర్వంగా చెబుతోంది. పార్టీ మీటింగు అయినా, ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఇదే విషయాన్ని పలుమార్లు చెబుతూ వస్తోంది. గత ప్రభుత్వంలో రెగ్యులర్ ఉద్యోగులకు సైతం ఒకటో తారీఖున వేతనాలు రాని దుస్థితి ఉండేదని సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అడ్డగోలు అప్పుల వలన రాష్ట్ర ఖజానాలో సగం అప్పులు, వాటి మీద వడ్డీలు చెల్లించడానికే పోతుందని ప్రకటించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు ఇబ్బందులు రాకుండా ప్రతినెలా 1న జీతాలు వచ్చేలా ఆర్థికశాఖను ఆదేశించినట్టు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పారు. అయితే, కాంగ్రెస్ పార్టీ నేతలు,సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న దానికి భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉన్నట్టు తెలుస్తోంది. తమకు వేతనాలు రావడం లేదని కొందరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటో తారీఖును దేవుడెరుగు.నెలకు ఒకసారి కూడా రావడం లేదని ఆందోళన చెందుతున్నారు.
మత్స్యశాఖలో నో జీతాలు..
రాష్ట్రంలోని మత్స్యశాఖలో పనిచేస్తున్న కిందిస్థాయి ఉద్యోగులకు వేతనాలు రావడం లేదని తెలుస్తోంది. మూడు నెలలుగా జీతాలు లేక మత్స్యశాఖ ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. అటెండర్లతో పాటు వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు రాలేదని సమాచారం. ఒకటో తారీఖున వేతనాలు ఇవ్వాలని జీవో జారీ చేసినట్టు ఉన్నతాధికారులు చెబుతున్నా.. తమకు మాత్రం ఇంతవరకు జీతాలు రాలేదని ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తప్పు ఎవరిది?
మరోవైపు అలవెన్సులు రాక క్షేత్రస్థాయిలో పనిచేసే ఫీల్డ్ ఆఫీసర్లు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే,ప్రభుత్వం జీతాలు చెల్లించాలని చెబుతున్నా కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఉద్యోగులు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం.గతంలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం కావడానికి గల కారణాలపై సీఎం ఆరా తీయగా ఉద్యోగుల లెక్కలు పంపడంలో కొందరు అధికారులు నిర్లక్ష్యం చేశారని ఆర్థికశాఖ సీఎంకు తెలిపింది.దీంతో సీఎం రేవంత్ రెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూడా అధికారుల నిర్లక్ష్యం వల్లే మత్య్స శాఖ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం అయ్యాయా? అని చర్చ జరుగుతోంది.లేదా ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ రాలేదా? అనేది తెలియాల్సి ఉంది. కాగా, పెండింగ్ వేతనాలు ముందు చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.


