రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం కారణంగా ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు క్రమంగా పడిపోతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు సాగుతో పాటు తాగు నీటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే సీరియస్గా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. వేసవిలో తాగు నీటి కష్టాలు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నట్టు సమాచారం.
ఇదిలాఉండగా, శ్రీ శైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు భారీగా తగ్గినట్టు తెలుస్తోంది. 215.80 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 48.57 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నట్టు సమాచారం. 885 అడుగుల పూర్తి స్థాయి నీటిమట్టానికి ప్రస్తుతం 829.10 అడుగులు ఉన్నట్టు తెలిసింది.కేవలం 9 రోజుల్లో 3.03 టీఎంసీల మేర నీటి నిల్వలు తగ్గినట్టు అధికారులు అంచనా వేశారు. రోజుకు సగటున 0.33 టీఎంసీల నీటి తగ్గుదల నమోదు అయినట్టు తేల్చారు.
జూరాల, సుంకేసుల, హంద్రీ నుంచి వరద ప్రవాహం నిలిచిపోవడం, పొరుగు రాష్ట్రం ఏపీ శ్రీశైలం నుంచి నీటికి తరలించుకుపోవడం, వర్షాలు సమృద్ధిగా కురవకపోవడం, వేసవి రాకముందే ఎండల తీవ్రత పెరగడంతో జలాశయంలో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నట్టు తెలిసింది. ప్రాజెక్టులో నీరు సమృద్ధిగా లేకపోవడంతో కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయినట్టు సమాచారం.
హైదరాబాద్,నల్లగొండ, ఖమ్మం తాగునీటి అవసరాలకు ప్రస్తుతం ఉన్న నీటిని జూలై వరకు సరిపెట్టేలా అధికారులు ప్రణాళిక రచించినట్టు సమాచారం. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే వేసవిలో తాగునీటి కష్టాలు తప్పవన్న ఆందోళన నెలకొంది. రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నా ఇంతవరకు చుక్క నీటి జాడలేదు. వర్షాలు కురిస్తే గ్రౌండ్ లెవల్లో నీటి మట్టం పెరుగుతుందని, ప్రాజెక్టుల్లో నీటి మట్టం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. లేదంటే మున్ముందు తాగు నీటికి కటకట తప్పదని తెలుస్తోంది.


