తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగి ప్రజలను గజగజ వణికిస్తోంది. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న చల్లని పొడి గాలుల ప్రభావంతో ఆదివారం రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే భారీగా పడిపోయాయి. రాష్ట్రంలోనే అత్యల్పంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు) మండలంలో 11.4 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 13.4 డిగ్రీలకు చేరడంతో నగరవాసులు చలికి వణికిపోతున్నారు.
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చలి తీవ్రతను పరిశీలిస్తే.. ఆసిఫాబాద్ జిల్లాలోని ఇతర మండలాల్లోనూ చలి ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. తిర్యానిలో 12 డిగ్రీలు, కెరమెరిలో 13.3 డిగ్రీలు, వాంకిడిలో 13.7 డిగ్రీలు, జైనూర్, కాగజ్నగర్, రెబ్బెన ప్రాంతాల్లో 14.9 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ చలి గాలుల తీవ్రత అధికంగా ఉంది. కాప్రా, చార్మినార్ ప్రాంతాల్లో 13.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, పటాన్చెరులో 13.8 డిగ్రీలు, అమీర్పేట, శేరిలింగంపల్లిలో 14.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నగరంలో సాధారణ స్థాయి కంటే 4 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి. నమోదవుతున్నాయని, జీహెచ్ఎంసీ పరిధిలో మరో పది రోజుల పాటు ఇదే తరహా చలి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో పొడి వాతావరణం మరికొన్ని రోజులు కొనసాగనుండగా, తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేస్తుండటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విపరీతమైన చలి కారణంగా నగరంలోని ఎంజీబీఎస్, జేబీఎస్ వంటి ప్రధాన బస్ స్టేషన్లలో ఉదయం వేళల్లో ప్రయాణికుల రద్దీ సాధారణం కంటే తక్కువగా కనిపించింది. చలి తీవ్రత దృష్ట్యా చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోస సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, బంగాళాఖాతంలో త్వరలో ఏర్పడనున్న ఉపరితల వాతావరణ మార్పుల ప్రభావంతో ఈ నెల 20వ తేదీ తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ వర్షాల అనంతరం రాష్ట్రంలో చలి తీవ్రత కొంతమేర తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.


