TG: తెలంగాణ సాయుధ పోరాటానికి అడ్డా అయిన నల్గొండ గడ్డపై సీపీఎం సీనియర్ నేత, మాజీ ఎంపీ బృందా కారత్ గర్జించారు. నల్గొండలోని ఎన్జీ కళాశాల గ్రౌండ్స్‌లో జరిగిన 36వ అఖిల భారత కిసాన్ సభ మహాసభల బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె, అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనా, ఇటు రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపైనా ఘాటైన విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా చారిత్రాత్మక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హిందూ-ముస్లింల గొడవగా మార్చేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి.
అది మత పోరాటం కాదు.. భూస్వాములపై తిరుగుబాటు
తెలంగాణ పోరాట చరిత్రను మార్చే కుట్రలను తిప్పికొట్టాలని బృందా కారత్ పిలుపునిచ్చారు. "నిజాం పాలనకు, భూస్వామ్య దేశ్‌ముఖ్‌ల దోపిడీకి, రజాకార్ల అండతో సాగిన వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా జరిగిన గొప్ప పోరాటం అది. మూడు వేలకుపైగా గ్రామాలను విముక్తి చేసి, దున్నేవాడికి భూమి దక్కాలనే లక్ష్యంతో దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, పుచ్చలపల్లి సుందరయ్య, మల్లు స్వరాజ్యం లాంటి ఎందరో పోరాడారు. నాలుగు వేల మంది ప్రాణాలు అర్పించిన ఆ పోరాటానికి మతం రంగు పులమాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ చూస్తున్నాయి. ఆ పోరాట చరిత్రను మత రాజకీయాల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది" అని ఆమె స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి గారూ.. ఆదివాసీలను ఆక్రమణదారులు అంటారా?
ఇదే స్టేజ్ మీద నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బృందా కారత్ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీల హక్కులను కాలరాయొద్దని హెచ్చరించారు. "రేవంత్ రెడ్డి గారూ.. గ్రామసభల మాట వినండి. అటవీ హక్కుల చట్టాన్ని వెంటనే అమలు చేసి పోడు రైతులకు పట్టాలు ఇవ్వండి. తరతరాలుగా అడవిని నమ్ముకుని బతుకుతున్న ఆదివాసీలను ఆక్రమణదారులు అని ముద్ర వేసి, వాళ్లను అడవుల నుంచి బయటకు పంపే ప్రయత్నాలు ఆపాలి" అని ఆమె డిమాండ్ చేశారు. అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో లక్షలాది హెక్టార్ల సాగుభూమిని తీసుకుని, 2013 చట్టం ప్రకారం పరిహారం కూడా ఇవ్వకుండా రైతులను రోడ్డున పడేస్తున్నారని మండిపడ్డారు.
అదానీ లాంటి కార్పొరేట్లకు లాభాలు.. రైతులకు రూ.6 వేల బిచ్చమా?
కేంద్రంలోని మోడీ ప్రభుత్వ తీరుపై బృందా కారత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో 20 శాతం ధనిక కుటుంబాల చేతుల్లోనే 75 శాతానికి పైగా భూమి ఉందని, అప్పుల బాధతో చిన్న రైతులు భూములు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులతో మాట్లాడకుండా కుదుర్చుకున్న భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం వల్ల మన రైతులు తీవ్రంగా నష్టపోతారని, దాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. అదానీ లాంటి పెద్ద కంపెనీలకు వేల కోట్ల లాభాలు కట్టబెడుతూ, రైతులకు ఏడాదికి రూ.6 వేలు ఇచ్చి ఏదో దానం చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కరెంట్ ప్రైవేటీకరణ, స్మార్ట్ మీటర్ల పేరుతో రైతుల నడ్డి విరగొట్టొద్దన్నారు. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం గడిచిన 12 ఏళ్లలో దేశంలో లక్షన్నర మంది రైతులు, కూలీలు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపరిహారం విషయంలో బీమా కంపెనీలు దోచుకుంటున్నాయని, స్వామినాథన్ కమిషన్ చెప్పినట్లు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మహిళలను కూలీలుగా కాదు.. రైతులుగా గుర్తించండి
వ్యవసాయ పనుల్లో సగానికి పైగా కష్టపడేది మహిళలే అయినా, ప్రభుత్వ రికార్డుల్లో వాళ్లను కేవలం 'కుటుంబ సహాయకులు'గా మాత్రమే రాస్తున్నారని బృందా కారత్ తప్పుబట్టారు. మహిళలకు భూమిపై హక్కు కల్పించి, అధికారికంగా వాళ్లను 'మహిళా రైతులు'గా గుర్తించాలని కోరారు. బిర్సా ముండా 151వ జయంతి సందర్భంగా ఆయన పోరాటాన్ని గుర్తుచేసుకున్న ఆమె, 90 ఏళ్లుగా ఎర్రజెండా రైతుల పక్షాన నిలబడిందని, కార్పొరేట్ వ్యతిరేక పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.


