డీలిమిటేషన్ పై ముందుకే అంటున్న కేంద్రం
50 శాతం సీట్ల పెంపు ఫార్ములాతో విపక్షాలకు గాలం?
ఎన్సీపీ సానుకూల సంకేతాలు.. డీఎంకేపై కేంద్రం ఆశలు..
దక్షిణాది రాజకీయాల్లో కీలక మలుపు!
దేశ రాజకీయాల్లో మరోసారి డీలిమిటేషన్ అంశం ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై ఇప్పటికే ఒకసారి కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. కానీ ఈసారి వెనక్కి తగ్గే ఆలోచనలో కేంద్రం లేదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్‌లో పార్లమెంట్ వేదికగా మరోసారి డీలిమిటేషన్‌కు సంబంధించిన బిల్లును ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇక్కడ అసలు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈసారి కేంద్రం కేవలం బిల్లు సిద్ధం చేయడమే కాదు, దానికి అవసరమైన రాజకీయ మద్దతును కూడా కూడగట్టే పనిలో ఉందన్న ప్రచారం జరుగుతోంది. గతంలో తీవ్రంగా వ్యతిరేకించిన కొన్ని ప్రతిపక్ష పార్టీల్లోనే ఇప్పుడు భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయనే టాక్ నడుస్తోంది. 50 శాతం సీట్ల పెంపు ప్రతిపాదన రాజకీయ సమీకరణాలను మార్చబోతోందా అనే చర్చ మొదలైంది.
పార్లమెంట్‌ను ఎందుకు ప్రొరోగ్ చేయలేదు?
ఆగస్టు 13న వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. సాధారణంగా ఆ తర్వాత పార్లమెంట్ సమావేశాలను అధికారికంగా ముగిస్తూ రాష్ట్రపతి ప్రొరోగ్ చేస్తారు. కానీ ఇంతకాలం గడిచినా మాన్‌సూన్ సెషన్‌ను అధికారికంగా ముగించకపోవడం ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీస్తోంది.
దీనివెనుక కేంద్రం వ్యూహం ఉందా? కొత్తగా పార్లమెంట్ సమావేశాలను పిలవడానికి అవసరమైన నోటీసు సమయం కోసం ఎదురుచూడకుండా, ఇప్పటికే కొనసాగుతున్న సమావేశాలను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంచుకుందా? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్న.
నవంబర్ 13 నాటికి సభలు వాయిదా పడి 91 రోజులు దాటిన నేపథ్యంలో, ప్రత్యేక సమావేశాల ద్వారా డీలిమిటేషన్ బిల్లును ముందుకు తీసుకురావచ్చన్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి. డిసెంబర్ మొదటి వారంలో వింటర్ సెషన్స్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
50 శాతం సీట్ల పెంపు.. కేంద్రం కొత్త అస్త్రం!
గతంలో డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాలను పెంచితే, జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా నష్టం జరుగుతుందన్నది ప్రధాన ఆందోళన. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండటంతో అక్కడ లోక్‌సభ స్థానాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్య వాటా తగ్గుతుందన్న భయం ఉంది.
ఈ సమస్యకు పరిష్కారంగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రస్తుత లోక్‌సభ స్థానాలకు అదనంగా 50 శాతం సీట్లు పెంచే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అంటే ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉన్నాయో వాటికి సమానంగా 50 శాతం పెంచడం. ఇలా చేస్తే రాష్ట్రాల మధ్య ప్రస్తుత సీట్ల వాటా దాదాపు యథాతథంగా కొనసాగే అవకాశం ఉంటుంది. కేంద్రం ఈ ఫార్ములాతోనే దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలను తగ్గించాలని చూస్తోందన్నది తాజా రాజకీయ విశ్లేషణ.
ఎన్సీపీ సానుకూల సంకేతాలు.. విపక్షాల్లో చీలిక?
ఈ వ్యవహారంలో తాజాగా ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నేత సుప్రియా సూలే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆరు నెలల క్రితం జరిగిన ఒక అనధికారిక చర్చలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లోనూ 50 శాతం సీట్లు పెంచే ప్రతిపాదన ప్రస్తావనకు వచ్చిందని వెల్లడించారు. అప్పట్లో ఆ చర్చలో పాల్గొన్న ప్రతిపక్ష నేతలకు ఆ ప్రతిపాదన సమంజసంగానే అనిపించిందని తెలిపారు. అయితే ప్రస్తుతం కేంద్రం నుంచి కొత్త ప్రతిపాదన ఏదీ తమకు అందలేదని కూడా ఆమె స్పష్టం చేశారు. ఈ పరిణామాలను గమనిస్తుంటే.. గతంలో ఉన్న వ్యతిరేకత తగ్గిందని స్పష్టమవుతోంది.
మరోవైపు డీఎంకేను కూడా ఒప్పించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. తమిళనాడు వంటి రాష్ట్రాల ప్రస్తుత లోక్‌సభ ప్రాతినిధ్య వాటాకు నష్టం జరగదనే భరోసా ఇవ్వగలిగితే డీఎంకే వైఖరిలో మార్పు రావచ్చని బీజేపీ వర్గాలు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏప్రిల్‌లో బిల్లుకు ఎదురుదెబ్బ.. ఇప్పుడు మళ్లీ ఎందుకు?
ఈ ఏడాది ఏప్రిల్ 17న మహిళా రిజర్వేషన్ల అమలును ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో అవసరమైన మద్దతు పొందలేకపోయింది. దీంతో డీలిమిటేషన్‌కు సంబంధించిన బిల్లుల ప్యాకేజీ ముందుకు సాగలేదు. ఇప్పుడు కేంద్రం మళ్లీ ప్రయత్నించడానికి ప్రధాన కారణం 2029 లోక్‌సభ ఎన్నికలేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టం ప్రకారం లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. అయితే దాని అమలు డీలిమిటేషన్ ప్రక్రియతో ముడిపడి ఉంది.
అందుకే మహిళా రిజర్వేషన్ల అమలు, లోక్‌సభ స్థానాల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన.. ఈ మూడు అంశాలను కలిపి ముందుకు తీసుకెళ్లాలని కేంద్రం చూస్తున్నట్లు తెలుస్తోంది.
అసలు పోరు ఎక్కడ మొదలవుతుంది?
ప్రస్తుతం 543 స్థానాలున్న లోక్‌సభ బలాన్ని గరిష్ఠంగా 850 స్థానాలకు పెంచే ప్రతిపాదన గతంలో కేంద్రం ముందుకు తెచ్చింది. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం. అలాంటి బిల్లు ఆమోదం పొందాలంటే ఉభయ సభల్లోనూ ప్రత్యేక మెజారిటీ తప్పనిసరి. గత ఏప్రిల్‌లో ఇదే అంశం కేంద్రానికి సంఖ్యాబలం పరంగా పెద్ద సవాలుగా మారింది.
ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం సీట్లు పెంచే ఫార్ములా ద్వారా ఆ సవాలును అధిగమించాలని కేంద్రం చూస్తోందన్న ప్రచారం ఉంది. అయితే ప్రతిపాదనలోని ప్రతి అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజనకు ఏ జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటారు? రాష్ట్రాల ప్రాతినిధ్య వాటా నిజంగానే మారకుండా ఉంటుందా? అన్నది కీలకం.
దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్తును నిర్ణయించే బిల్లా?
ఇది కేవలం లోక్‌సభ స్థానాల పెంపునకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు. దేశంలో ఏ ప్రాంతానికి ఎంత రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలి? జనాభా పెరుగుదల ఆధారంగా ప్రాతినిధ్యం నిర్ణయించాలా? లేక జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు కూడా సమాన రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలా? అన్న మౌలిక ప్రశ్నలతో ముడిపడి ఉంది.
కేంద్రం ప్రతిపాదించే 50 శాతం ఫార్ములాకు మరిన్ని పార్టీలు మద్దతు ఇస్తే రాజకీయ సమీకరణాలు మారవచ్చు. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలిగే అవకాశం ఉందని భావిస్తే మరోసారి పార్లమెంట్‌లో తీవ్ర ప్రతిఘటన తప్పకపోవచ్చు.
డిసెంబర్ పార్లమెంట్ సమావేశాలు ఈ అంశంపై కీలక మలుపు కానున్నాయా? విపక్షాల మధ్య భిన్నాభిప్రాయాలను కేంద్రం తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతుందా? మహిళా రిజర్వేషన్ల పేరుతో ముందుకొచ్చే డీలిమిటేషన్ బిల్లు దేశ రాజకీయ పటాన్నే మార్చబోతోందా? ఇప్పుడు దేశ రాజకీయాల్లో అందరి దృష్టి పార్లమెంట్ వైపే! ఒకట్రెండు రోజుల్లోనే దీనిపై అధికారిక ప్రకటన రావచ్చనే వార్తలు ఢిల్లీ లెవల్ లో హల్ చల్ చేస్తున్నాయి.


