TG: తెలంగాణలో నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ పర్మిషన్లు ఇప్పించే విషయంలో చొరవ తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరినట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం ఢిల్లీలో ప్రధాని మోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ కీలక వివరాలను వెల్లడించారు.
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలపై ప్రధానితో సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. ముఖ్యంగా పర్యావరణ పర్మిషన్లు రాకపోవడం వల్ల ఎంతో ముఖ్యమైన ప్రాజెక్టుల పనులు మధ్యలోనే ఆగిపోయాయని ప్రధాని దృష్టికి తీసుకెళ్లామన్నారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు ఇవ్వడంలో చాలా లేట్ చేస్తోందని, దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఆయనకు వివరించినట్లు తెలిపారు. అలాగే, రాష్ట్రంలో నెలకొన్న ఎల్నినో పరిస్థితులను కూడా ప్రధానికి వివరించామని, భూగర్భ జలాలను తిరిగి పెంచేందుకు కేంద్రం నుంచి రూ. 5 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని కోరినట్లు ఉత్తమ్ చెప్పారు.
తుమ్మిడిహెట్టి, సమ్మక్క-సారక్క బ్యారేజీలపై చర్చ
తుమ్మిడిహెట్టి - ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తెలంగాణకు ఎంత అవసరమో ప్రధానికి వివరించామని అన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి, వారిని ఒప్పించేలా చొరవ చూపాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. అలాగే, సమ్మక్క-సారక్క బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన పర్యావరణ పర్మిషన్ల ప్రక్రియలో స్పీడ్ పెంచాలని ప్రధానిని కోరామని అన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పరిహారం ఎంతైనా ఇవ్వడానికి తెలంగాణ రెడీగా ఉందని, ఈ విషయాన్ని ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేశామని ఆయన వెల్లడించారు. రాష్ట్రానికి సంబంధించిన ఈ కీలక ప్రాజెక్టుల విషయంలో కేంద్రం నుంచి పూర్తి సహకారం అందించాలని ప్రధానిని కోరినట్లు ఉత్తమ్ వివరించారు. ఇక రాష్ట్రంలో నీటి లభ్యతపై గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతానికి హైదరాబాద్ నగరంలో ఎలాంటి నీటి కొరత లేదని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఉత్తమ్ స్పష్టం చేశారు. అయితే, నీటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాబోయే యాసంగి సీజన్లో రైతులు వరి పంట వేయొద్దని విజ్ఞప్తి చేశారు.


