TG: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల తీరుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన గిగ్ వర్కర్ల ర్యాలీలో కనిపించిన దృశ్యాలపై ఆయన 'ఎక్స్' వేదికగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీ కుటుంబానికి బాడీగార్డుగా మారిపోయారని కేటీఆర్ విమర్శించారు.
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ బైక్ వెనక, రాష్ట్ర మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు పరుగులు తీయడం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నేతలు ఇలా అధిష్ఠానం నేతల వెంట పరుగులు తీయడం చూస్తుంటే, వారికి తమ పదవుల పట్ల ఏమాత్రం గౌరవం లేదనిపిస్తోందని ఆయన రాసుకొచ్చారు.
ఇదే క్రమంలో బీజేపీ నేతలను కూడా కేటీఆర్ వదల్లేదు. గతంలో కేంద్ర మంత్రి బండి సంజయ్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పులు మోసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ గడ్డకు ఒక ఆత్మగౌరవం ఉందని, కానీ ఈ రెండు జాతీయ పార్టీల నాయకులు ఇప్పటికీ ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం లేదని కేటీఆర్ అన్నారు. ఢిల్లీ పెద్దల మెప్పు కోసం రాష్ట్ర నేతలు వ్యవహరిస్తున్న తీరుపై కేటీఆర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.


