Diwali Gold Shopping: భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది తరతరాల సెంటిమెంట్, కష్టకాలంలో ఆదుకునే నమ్మకమైన ఆస్తి. పండుగ వచ్చిందంటే చాలు.. కొత్త బట్టలు, పిండివంటల సందడితో పాటు ప్రతి ఇంటా వినిపించే మరో ప్రధాన మాట 'పసిడి'. తాజాగా ముగిసిన దీపావళి, ధంతేరాస్ వేడుకల్లో మనవాళ్ల బంగారం క్రేజ్ మరోసారి రికార్డులను తిరగరాసింది. దేశవ్యాప్తంగా జనం ఏకంగా 52 టన్నుల (అంటే 52,000 కిలోలు) బంగారాన్ని కొనుగోలు చేశారంటే, ఇండియాలో పసిడి మోజు ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే సుమారు రూ. 72 వేల కోట్ల విలువైన వ్యాపారం జరగడం మార్కెట్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది.
ఆపదలో ఆదుకునే కవచం.. అందుకే ఇంత క్రేజ్!
మన సమాజంలో బంగారానికి ఉన్న స్థానం ప్రత్యేకం. పెళ్లిళ్లలో కట్నకానుకల కంటే ఆడపిల్ల ఒంటిపై ఉండే పసిడికే పెద్దలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. గతంలో తక్కువ ధర ఉన్నప్పుడు కొన్న నాలుగు తులాల బంగారమే, నేడు అత్యవసర పరిస్థితుల్లో కుటుంబాలను గట్టెక్కించే ఆర్థిక రక్షణ కవచంగా మారిందన్న భావన ప్రతి ఇంట్లోనూ బలంగా ఉంది. ఇక పండుగ సెంటిమెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధంతేరాస్ రోజున తులమో, మాసమో బంగారం కొంటే సాక్షాత్తూ లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుందని, దీపావళికి కొంటే ఏడాదంతా పసిడి కొంటూనే ఉంటామనే నమ్మకం ప్రజల్లో నాటుకుపోయింది. ఈ సెంటిమెంటే దేశవ్యాప్తంగా నగల దుకాణాలను జనంతో కిటకిటలాడేలా చేసింది.
రూ. 40 వేలు తగ్గిన ధర.. భవిష్యత్తుపై భయం!
ఈ స్థాయిలో రికార్డు అమ్మకాలు జరగడం వెనుక రెండు కీలక కారణాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో తులం బంగారం ధర ఏకంగా రూ. 1.80 లక్షల మార్కును తాకి సామాన్యులకు చుక్కలు చూపించింది. అయితే, పండుగ నాటికి అది రూ. 1.40 లక్షల స్థాయికి దిగిరావడంతో కొనుగోలుదారులకు రూ. 40 వేల మేర భారీ ఊరట లభించింది. ఇదే సరైన సమయమని భావించిన జనం షాపులకు పోటెత్తారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న కఠిన ఆర్థిక విధానాలు, విదేశాల్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా రాబోయే రోజుల్లో వ్యాపారాలు దెబ్బతిని, బంగారం ధరలు మళ్లీ రాకెట్ వేగంతో పైకి ఎగబాకవచ్చనే భయం జనాల్లో నెలకొంది. రేపు ధరలు ఆకాశాన్నంటితే కొనలేమన్న ముందుచూపుతో, చేతిలో డబ్బున్న వారంతా ఇప్పుడే బంగారాన్ని కొని దాచుకునేందుకు మొగ్గు చూపారు.
ప్రధాని పిలుపు కంటే సెంటిమెంటే గొప్పదా?
దేశ ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా బంగారం కొనుగోళ్లను తగ్గించాలని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా హైదరాబాద్ గడ్డపై నుంచే ప్రజలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ, భారతీయుల సెంటిమెంట్, భవిష్యత్తు భద్రత ముందు ఆ పిలుపు పని చేయనట్లు కనిపిస్తోంది. ఇంట్లో ఎంత ఎక్కువ బంగారం ఉంటే అంత విలువ, అంత గౌరవం అనే భావన ఉన్నంత కాలం.. దేశంలో ఈ పసిడి జాతర ఇలాగే కొనసాగుతుందని ఈ 72 వేల కోట్ల రికార్డు కొనుగోళ్లు మరోసారి నిరూపించాయి.


