తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అధికారికంగా సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో సీఎం వెంట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, ఎల్-నినో ప్రభావం, సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ అనుమతులు తదితర అంశాలపై ప్రధానితో చర్చించిన ముఖ్యమంత్రి బృందం, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ప్రత్యేక సహకారాన్ని కోరింది.
ఈ సమావేశంలో ప్రస్తావించిన ప్రధానాంశాలు గమనిస్తే.. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఏర్పడిన లోటు వర్షపాతం, కరువు పరిస్థితులను ప్రధానికి వివరించిన సీఎం రేవంత్ రెడ్డి, సుమారు 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినట్లు తెలిపారు. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్రం తరఫున రూ.30వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీని తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ఓసీ ఇప్పించాలని కోరారు. అలాగే సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్గఢ్ నుంచి అనుమతులు, సీతమ్మసాగర్ బ్యారేజీకి పర్యావరణ అనుమతులు త్వరగా లీరసేలా కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. గోదావరి - కావేరీ నదుల అనుసంధానంలో భాగంగా సమ్మక్కసాగర్ లేదా ఇచ్చంపల్లి నుంచి ప్రాజెక్టును చేపట్టి, తరలించే జలాల్లో తెలంగాణకు 50 శాతం వాటా కల్పించాలని విన్నవించారు.
డిసెంబర్ 7 నుంచి 9 వరకు తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 'గ్లోబల్ సమ్మిట్' అలాగే డిసెంబర్లో జరగనున్న 'ఖేలో ఇండియా' క్రీడల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానాలు అందజేశారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని భేటీతో పాటు ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం తదితర వేడుకల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి విన్నపం మేరకు కేంద్రం తెలంగాణకు రూ.30వేల కోట్ల నిధులను అందజేస్తుందో లేదో వేచిచూడాల్సిందే.


