వ్యాపారం

మెటాకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఇటలీ.. ఏకంగా రూ.7,400కోట్ల భారీ జరిమానా!

4 నిమిషాల పఠనం

సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) సంస్థకు ఇటలీలో ఊహించని రీతిలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వినియోగదారుల ప్రత్యేక అనుమతి లేకుండా వారి స్మార్ట్‌ఫోన్ గ్యాలరీలోని వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను యాక్సెస్ చేసినట్లు రుజువు కావడంతో ఇటలీ డేటా పరిరక్షణ నియంత్రణ సంస్థ మెటాపై కొరడా ఝళిపించింది.

 సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) సంస్థకు ఇటలీలో ఊహించని రీతిలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వినియోగదారుల ప్రత్యేక అనుమతి లేకుండా వారి స్మార్ట్‌ఫోన్ గ్యాలరీలోని వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను యాక్సెస్ చేసినట్లు రుజువు కావడంతో ఇటలీ డేటా పరిరక్షణ నియంత్రణ సంస్థ మెటాపై కొరడా ఝళిపించింది. యూరోపియన్ గోప్యతా చట్టాలను ఉల్లంఘించినందుకు గాను మెటాకు ఏకంగా 805 మిలియన్ యూరోలు.. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.7,400కోట్ల భారీ జరిమానా విధిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది.

 ఇటలీ అధికారుల విచారణ ప్రకారం.. 2023 నుంచి ఫేస్‌బుక్ ఆండ్రాయిడ్ యాప్‌లో 'గెట్ సజెషన్స్ ఫ్రమ్ గ్యాలరీ వెన్ బ్రౌజింగ్ ఫేస్‌బుక్' (Get suggestions from gallery when browsing Facebook) అనే ఒక ప్రత్యేక ఫీచర్ అందుబాటులో ఉంది. వినియోగదారులు ఫేస్‌బుక్ యాప్‌ను బ్రౌజ్ చేస్తున్న సమయంలో, వారి ఫోన్ గ్యాలరీలో ఉన్న ఫొటోలు, వీడియోలను పోస్టులుగా షేర్ చేసేలా ఈ ఫీచర్ ఆటోమేటిక్‌గా సూచనలు ఇస్తుంది.

 అయితే, ఈ ఫీచర్ సాకుతో వినియోగదారుల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండానే వారి ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు, వాటికి సంబంధించిన ఇతర సున్నితమైన సమాచారాన్ని మెటా యాక్సెస్ చేసినట్లు ఇటలీ డేటా పరిరక్షణ సంస్థ గుర్తించింది. ఇంతటి కీలక విషయాన్ని వినియోగదారులకు కనీసం స్పష్టంగా తెలియజేయలేదని తప్పుబట్టింది.

 ఈ గోప్యతా ఉల్లంఘన కారణంగా ఒక్క ఇటలీ దేశంలోనే దాదాపు 2 కోట్ల మంది ఆండ్రాయిడ్ వినియోగదారుల వ్యక్తిగత డేటాపై ప్రభావం పడి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిమానాతో పాటు మెటాకు ఇటలీ నియంత్రణ సంస్థ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ గ్యాలరీ నుంచి ఫొటోలు, వీడియోలను సూచించే సదరు ఫీచర్‌ను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది.

 భవిష్యత్తులో ఎవరైనా ఆ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలని భావిస్తే, వారి నుంచి ప్రత్యేకంగా, స్పష్టమైన సమ్మతి (Consent) తీసుకున్న తర్వాతే అనుమతించాలని తేల్చిచెప్పింది. ఈ సాంకేతిక మార్పులన్నింటినీ అమలు చేసేందుకు మెటాకు 60 రోజుల గడువు విధించారు. మరోవైపు, ఇటలీ అధికారులు విధించిన ఈ భారీ జరిమానాపై మెటా యాజమాన్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నియంత్రణ సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంతో తాము ఏమాత్రం ఏకీభవించడం లేదని, విధించిన జరిమానా అసమానంగా ఉందని పేర్కొంటూ తదుపరి న్యాయపరమైన చర్యలపై దృష్టి సారించింది.

#ItalyMetaFine7400Crores2026#MetaPrivacyViolationItaly#FacebookAndroidGalleryFeature#MetaFined805MillionEuros#TechNewsTelugu#InternationalNewsTelugu#BusinessNewsTelugu#HydNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి