ప్రసంగం మధ్యలో తన మైక్ కట్ చేశారని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే స్టేజీ మీద రచ్చ రచ్చ చేశారు.అంతేకాకుండా కుర్చీలతో సౌండ్ ఆపరేటర్ మీద దాడికి ప్రయత్నించారు.ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలో జరిగింది. నిన్న ఉదయం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి జౌల్జీ బీ జాతరను ప్రారంభించి, తన ప్రసంగం అనంతరం వేదికపై నుంచి వెళ్లిపోయారు.
ఆ తర్వాత స్థానిక ధార్చులా నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీష్ ధామి మాట్లాడేందుకు వేదికపైకి వచ్చారు.సీఎం పుష్కర్ సింగ్ తన ప్రసంగం వినకుండానే వెళ్లిపోయారని హరీష్ ధామి విమర్శలు ప్రారంభించారు. ఆ వెంటనే మైక్ అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో తనను మాట్లాడకుండా అడ్డుకునేందుకే కావాలని మైక్ ఆపేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించారు.
తీవ్ర ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే చేతిలోని మైక్‌ను విసిరికొట్టి, సౌండ్ సిస్టమ్ ఆపరేటర్లతో వాగ్వాదానికి దిగారు. అనంతరం వేదికపై ఉన్న పోడియంను కిందపడేయడంతో పాటు కుర్చీలను విసిరేసి సిబ్బందిపై దాడికి యత్నించారు. ఎమ్మెల్యే మద్దతుదారులు కూడా వేదిక వద్దకు చేరుకుని ఆందోళనకు దిగడంతో కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది.వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ నియోజకవర్గానికి ప్రజాప్రతినిధి అయి ఉండి వీధి రౌడీలా ప్రవర్తించడం ఏంటని మిగతా ప్రజాప్రతినిధులు, ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, బహిరంగ సభలో ఒక ప్రజాప్రతినిధి ఇలా వ్యవహరించడం సరికాదని అధికార పార్టీ బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. మరోవైపు, స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అవమానించారని హరీష్ ధామి ఒక వీడియో ప్రకటన ద్వారా తన చర్యను సమర్థించుకున్నారు.


