భారీ డీజే శబ్దాలకు పక్షులే కాదు మనుషులు సైతం పిట్టల్లా రాలిపోతున్నారు. సౌండ్స్ తగ్గించాలని, నివాస సముదాయాల్లో డీజేలు ప్లే చేయవద్దని చట్టప్రకారం నిబంధనలు ఉన్నా వేడుకలు, ఉత్సవాల పేరిట కొందరు నిర్వాహకులు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. ఇష్టానుసారంగా డీజేల మోత మోగించడంతో చిన్నారులు, యువకులు, వృద్ధులు అకాల మరణం చెందుతున్నారు. ఉన్నట్టుండి కుప్పకూలుతున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి దారుణ ఘటనలు వెలుగుచూస్తున్న డీజే నిర్వాహకుల తీరు మాత్రం మారడం లేదు.
తాజాగా డీజే సౌండ్ దెబ్బకు ఓ చిన్నారి నిద్రలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ తీవ్ర విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లా ముడియారీ గ్రామం మనియార్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. లక్ష్మీ విగ్రహం నిమజ్జన ఊరేగింపులో భాగంగా డీజే సిస్టమ్ అమర్చిన ట్రక్కు ఓ ఇంటి ముందు ఆగింది.
భారీ శబ్దంతో డీజే ప్లే చేస్తుండగా ఇంట్లో 20 రోజుల పసికందు ఉందని, శబ్దం తగ్గించాలని తల్లి రీమా దేవి వేడుకుంది. కనీసం వాహనాన్ని అయినా ముందుకు తీసుకెళ్లాలని వేడుకున్నా నిర్వాహకులు పట్టించుకోలేదు. అయితే, భారీ శబ్దాలకు గాను పసికందు గుండె ఆగిపోయి కన్నుమూసింది.కళ్ల ముందే పసికందు విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి డీజే వాహనం సహా సౌండ్ సిస్టమ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పసికందు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం పోలీసులను వేడుకుంది.
ఇదిలాఉండగా, దేశంలో చట్టపరమైన నిబంధనల ప్రకారం.. నివాస ప్రాంతాలలో డీజే లేదా లౌడ్ స్పీకర్ల శబ్దం పగటిపూట 55 డెసిబుల్స్ , రాత్రిపూట 45 డెసిబుల్స్ లోపు మాత్రమే ఉండాలి. కానీ, డీజే నిర్వాహకులు ఈ నిబంధనలను అస్సలు పాటించకుండా మరణాలకు కారణం అవుతున్నారు. సాధారణంగా 100 నుంచి 120 డెసిబుల్స్ దాటిన తీవ్రమైన శబ్దాలు లేదా బేస్ ప్రకంపనలు గుండె జబ్బులు ఉన్నవారిలో గుండెపోటు ప్రమాదాన్ని మరింత పెంచుతాయి. డీజే వద్ద డ్యాన్సులు వేస్తూ శబ్ద తరంగాల తాకిడి గురై యువతీయువకులు, పెద్దలు, చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఇప్పటికే అనేకం వెలుగుచూశాయి.


