AP: ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు, ముఖ్యంగా కోస్తాంధ్రకు పెను తుపాను గండం పొంచి ఉంది. ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం వేగంగా బలపడుతూ ముందుకు కదులుతోంది. ప్రస్తుతం ఇది చెన్నైకి 840 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 1,010 కిలోమీటర్ల దూరంలో ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా పయనిస్తున్న ఈ వాయుగుండం, రానున్న రోజుల్లో మరింత తీవ్రరూపం దాల్చి కోస్తాంధ్రపై విరుచుకుపడే ప్రమాదం కనిపిస్తోందని చెబుతున్నారు.
కోస్తాంధ్రలోనే తీరం దాటే అవకాశం..
వాతావరణ కేంద్రం హెచ్చరికల ప్రకారం.. ఉత్తర-వాయవ్య దిశగా కదులుతున్న ఈ వాయుగుండం రేపు తెల్లవారుజామున దక్షిణ, మధ్య పశ్చిమ బంగాళాఖాతంలో తుపానుగా మారనుంది. ఆ తర్వాత నేరుగా ఏపీ తీరం వైపు దూసుకొస్తూ పెను బీభత్సం సృష్టించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ నెల 17న ఇది తీవ్ర తుపానుగా బలపడనుంది. 18వ తేదీ నాటికి అతి తీవ్ర తుపానుగా మారే ప్రమాదముందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి చూస్తే, ఇది కోస్తాంధ్రలోనే అతి తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
19న అతి భారీ వర్షాలు.. పోర్టులకు ప్రమాద హెచ్చరికలు
అతి తీవ్ర తుపాను ప్రభావంతో ఈ నెల 19వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. తీర ప్రాంతాలకు పెను ముప్పు పొంచి ఉండటంతో ఏపీతో పాటు దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉన్నందున, కళింగపట్నం మినహా రాష్ట్రంలోని అన్ని పోర్టులకూ ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేసి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.


