రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ వైపు ఎల్ నినో ప్రభావం మరోవైపు సాగు నీరు లేక కోత దశకు వచ్చిన పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంటలు ఎండిపోవడంతో పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులకు వడ్డీల భారం మరింత పెరుగుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు.
ఈ క్రమంలోనే అప్పులు తిరిగి చెల్లించలేక రైతులు చావే మార్గంగా ఎంచుకుంటున్నారు.తాజాగా అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో అప్పులు తీర్చే మార్గం లేక రైలు కింద పడి కౌలురైతు ఆశన్న (43) ఆత్మహత్యకు పాల్పడ్డారు. 17 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, కంది సాగు చేసిన ఆశన్న .. ఆశించిన దిగుబడి రాక, ఇదివరకు చేసిన అప్పుల భారం పెరిగిపోవడంతో అవి తీర్చలేక ప్రాణాలు తీసుకున్నాడు.
అదే విధంగా రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఆర్థిక ఇబ్బందులతో రైతు వెంకటయ్య (45) ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదిలాఉండగా, ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో నవంబర్ 13న వేర్వేరు ఘటనల్లో ముగ్గురు రైతులు (జర్పూల వెంకటేష్ - నల్లబెల్లి, మెట్ల ఉప్పలమ్మ - నర్మెట్ట, బానోతు రాములు - మహబూబాబాద్) ఆత్మహత్య చేసుకున్నారు. పత్తి, వరి, మొక్కజొన్న పంటలు వేసి నష్టపోవడంతో పాటు చేసిన అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకున్నారు.
ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వర్గాలు సరిగా పడకపోవడంతో పత్తి, వరి, మొక్కజొన్న లాంటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. అయితే, సాగు కోసం బ్యాంకులు, ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద చేసిన అప్పులు తీర్చలేకపోవడం, కౌలు రైతులకు ప్రభుత్వ సహాయం అందడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.


