భాగ్యనగర వాసులకు రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ అధికారులు ఊహించని రీతిలో షాక్ ఇచ్చారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహ్లాదం కోసం, వ్యాయామం కోసం పార్కులకు వెళ్లే సామాన్యులపై భారం మోపుతూ హైదరాబాద్ నగరంలోని పార్కుల ప్రవేశ (ఎంట్రీ) టికెట్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పార్కుల నిర్వహణ వ్యయం పెరిగిందన్న కారణంతో ప్రభుత్వం ఈ టికెట్ ధరల పెంపును అమల్లోకి తీసుకువస్తుండటంతో నగరవాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పటివరకు పెద్దలకు రూ.10గా ఉన్న ఎంట్రీ టికెట్ ధర ఏకంగా రెట్టింపై రూ.20కి చేరుకోనుంది. అదేవిధంగా చిన్నపిల్లలకు రూ.2గా ఉన్న ప్రవేశ రుసుమును రూ.5కు పెంచుతూ అధికారులు ఉత్తర్వులు సిద్ధం చేశారు. సెలవు దినాల్లో, వారాంతాల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉద్యానవనాలకు వెళ్లే మధ్యతరగతి, సామాన్య కుటుంబాలపై ఈ పెంపు అదనపు ఆర్థిక భారాన్ని మోపనుందని సందర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, టికెట్ ధరల పెంపు నిర్ణయంపై నగరవాసులు, మార్నింగ్ వాకర్స్ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నగరంలోని చాలా పార్కులలో కనీస మౌలిక సదుపాయాలు కూడా కరువయ్యాయని ప్రజలు విమర్శిస్తున్నారు. సరైన మరుగుదొడ్లు లేకపోవడం, స్వచ్ఛమైన తాగునీటి వసతి కొరవడటం, ఎక్కడికక్కడ చెత్తాచెదారంతో పరిశుభ్రత లోపించడం వంటి సమస్యలు వేధిస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు.
ముందుగా పార్కులలో మౌలిక వసతులను మెరుగుపరిచి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాల్సింది పోయి, ఎలాంటి సౌకర్యాలు లేకుండానే టికెట్ ధరలను రెట్టింపు చేయడమేంటని సందర్శకులు ప్రశ్నిస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ఏకైక వినోద, ఆరోగ్య కేంద్రాలుగా ఉన్న పార్కులపై ప్రభుత్వం ఇలా బాదుడు మొదలుపెట్టడం సరికాదని, పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.


