నేటి ఆధునిక సమాజంలో విపరీతంగా పెరుగుతున్న సామాజిక మాధ్యమాల వినియోగంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అధినేత మోహన్ భగవత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలు కూడా ఒకరకమైన వ్యసనమేనని, అన్ని రకాల వ్యసనాల మాదిరిగానే ఇది కూడా వ్యక్తిగత, సామాజిక చైతన్యాన్ని దెబ్బతీస్తుందని ఆయన హెచ్చరించారు. రాజస్థాన్లోని జోధ్పూర్ సమీపం షికార్పురాలోని శ్రీ రాజారామ్ ఆశ్రమంలో నిర్వహించిన 'మారు నినాద్-2026' ఘోష్ శివిర్ ముగింపు వేడుకల్లో ఆదివారం ఆయన ప్రసంగిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
వ్యసనం అంటే కేవలం మత్తుపదార్థాలు లేదా రసాయనాలకు బానిస కావడం మాత్రమే కాదని, ప్రతిరోజూ తాగే టీ, కాఫీలు కూడా వ్యసనంగా మారే ప్రమాదం ఉందని భగవత్ వివరించారు. అదే విధంగా కులం, భాష, ప్రాంతం వంటి సంకుచిత గుర్తింపులకు అతిగా అంటిపెట్టుకుని ఉండటం కూడా ఒకరకమైన మత్తు లాంటిదేనని, ఇలాంటి బంధాలకు దూరంగా ఉన్నవారే సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని సూచించారు. ఏ వ్యసనమైనా మనిషి ఆలోచనా శక్తిని బలహీనపరుస్తుందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని అంతర్జాతీయ శక్తులు కుట్రలు పన్నుతున్నాయని మోహన్ భగవత్ ఆరోపించారు. చిన్నచిన్న గుర్తింపులను అడ్డుపెట్టుకుని సమాజంలో విభేదాలు సృష్టిస్తున్నాయని, ఇది నాటి బ్రిటిష్ పాలకుల 'విభజించి పాలించు' విధానాన్ని గుర్తు చేస్తోందని విమర్శించారు. భారత్ సరైన మార్గంలో ముందుకు వెళ్తున్నప్పటికీ, మన దేశం ఒక గొప్ప శక్తిగా ఎదగడం కొన్ని ప్రపంచ శక్తులకు ఇష్టం లేదని, తమ స్వార్థ ప్రయోజనాల కోసం మనల్ని అడ్డుకోవాలని చూస్తున్నాయని మండిపడ్డారు. బ్రిటిష్ పాలకులు మన సంప్రదాయ విద్యావ్యవస్థను నాశనం చేసి వారి విధానాలను రుద్దడం వల్లే దేశం బలహీనపడిందన్నారు.
స్వార్థ ప్రయోజనాలు, విభేదాలు, వ్యక్తిగత అహంకారాన్ని వీడి ధర్మం, దేశ సేవ లక్ష్యంగా సంఘటిత సమాజాన్ని నిర్మించాలని భగవత్ పిలుపునిచ్చారు. ఇందుకోసం దేశంలోని ప్రతి గ్రామం, వీధిలో 25 నుంచి 100 మంది నిస్వార్థపరులు, మంచి నడవడిక గల సేవకులు సిద్ధంగా ఉండాలని ఆకాంక్షించారు. మహాభారత యుద్ధాన్ని ఉదహరిస్తూ, కౌరవుల వద్ద అపారమైన సైన్యం, గొప్ప యోధులు ఉన్నప్పటికీ అంతర్గత కలహాలు, ఐక్యత లోపించడం వల్లే ఓటమి పాలయ్యారని గుర్తుచేశారు. అదే సమయంలో పాండవులు చిన్న సైన్యంతో ఉన్నా ఐక్యంగా నిలవడం వల్లే విజయం సాధించారని వివరించారు.


