ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒళ్లు గగుర్పొడిచే ఒక అద్భుతమైన సంఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడికి అకస్మాత్తుగా ఎదురైన అడవి ఏనుగు, అతడి పొట్ట, ఛాతీ భాగాలపై ఏకంగా రెండుసార్లు తన భారీ కాలు మోపింది. సాధారణంగా ఇంతటి బరువు కింద చిక్కుకుంటే ప్రాణాలు దక్కడం అసాధ్యమైనప్పటికీ, ఆ వ్యక్తి అదృష్టవశాత్తూ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. ఏనుగు అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోగానే ఆ బైకర్ వెంటనే పైకి లేచి నిలబడటం చూసిన వారందరినీ తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది.
హరిద్వార్-డెహ్రాడూన్ జాతీయ రహదారిపై నేపాలీ ఫామ్ సమీపంలో గురువారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో ఈ భయానక ఘటన జరిగింది. బైక్‌పై వెళ్తున్న సదరు వ్యక్తికి అకస్మాత్తుగా అడవి ఏనుగు ఎదురుపడటంతో అదుపుతప్పి కిందపడ్డాడు. ఆ సమయంలో అతడి వద్దకు వచ్చిన గజరాజు పొట్ట, ఛాతీపై రెండుసార్లు కాలు పెట్టి తొక్కినట్లు కనిపించింది. అయితే ఏనుగు తన పూర్తి శరీర బరువును మోపకపోవడంతో అతడికి ఎలాంటి ప్రాణాపాయం లేదా తీవ్ర గాయాలు కాలేదని భావిస్తున్నారు.
ఈ భయానక దృశ్యాలను అటుగా కారులో వెళ్తున్న క్యాబ్ డ్రైవర్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్ శివ శర్మ తన కెమెరాలో బంధించి నవంబర్ 12 తెల్లవారుజామున ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. హరిద్వార్-డెహ్రాడూన్ మార్గంలో ప్రయాణం సాధారణంగా సులభంగానే ఉన్నప్పటికీ, అడవి జంతువులు అనూహ్యంగా రహదారిపైకి రావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఊహించలేమని శివ శర్మ పేర్కొన్నారు. అంతటి భీకర ప్రమాదం నుంచి బైకర్ ప్రాణాలతో బయటపడటం నిజంగా పునర్జన్మేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ప్రసిద్ధ రాజాజీ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతానికి సమీపంలో ఈ జాతీయ రహదారి ఉండటంతో ఇక్కడ తరచూ ఏనుగుల సంచారం కనిపిస్తుంటుంది. ముఖ్యంగా అర్ధరాత్రి, తెల్లవారుజామున వేళల్లో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. రహదారిపై ఏనుగులు కనిపిస్తే వాహన వేగాన్ని తగ్గించి, హారన్లు మోగించకుండా, వాటికి దగ్గరగా వెళ్లకుండా సురక్షిత దూరం పాటించాలని హెచ్చరిస్తున్నారు.


