ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ పేరిట మరో కొత్త పొలిటికల్ పార్టీ ఉద్భవించింది. మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కొత్త పార్టీని ప్రకటించారు. ‘దేశం కోసం.. ధర్మం కోసం’ పార్టీని స్థాపించినట్టు విజయసాయిరెడ్డి తెలిపారు. ‘జనం కోసం.. జనం హితం’ కోసం అనే నినాదంతో ప్రజల మధ్యకు వెళ్లి పనిచేస్తామని ప్రకటించారు. కొత్త తరం, కొత్త ఆంధ్రప్రదేశ్ అనే లక్ష్యంతో ‘పరివర్తన రాజనీతి పార్టీ’ ముందుకు వెళ్తుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త తరహా రాజకీయాలకు నాంది పలకడమే తమ లక్ష్యమని పార్టీ ప్రకటన సందర్భంగా విజయసాయి రెడ్డి చెప్పారు. పరివర్తన రాజకీయ పార్టీ పేరులోని మొదటి అక్షరాలతో ‘PRP’గా దానికి నామకరణం చేశారు. ఏపీలో అధికార కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ), ప్రతిపక్ష వైసీపీ మధ్య రాజకీయ వైరం కొనసాగుతున్న క్రమంలో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయితే, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, విధివిధానాలు, సంస్థాగత నిర్మాణం, ప్రజల్లోకి వెళ్లే ప్రణాళికపై విజయసాయిరెడ్డి త్వరలోనే ప్రకటన చేస్తారని తెలుస్తోంది. మాజీ రాజ్యసభ మెంబర్ విజయసాయిరెడ్డి స్థాపించిన ‘పరివర్తన రాజనీతి పార్టీ’ జెండాను సైతం విడుదల చేశారు. రెండు రంగుల్లో జెండాను ఆవిష్కరించగా.. పైన కాషాయం, కింద తెలుపు రంగులో జెండాను డిజైన్ చేశారు. మధ్యలో శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం తరహాలో ఓ ధర్మ చక్రాన్ని ఉంచారు.
దేశంలో ధర్మ స్థాపన అనగా మెజార్టీ వర్గం ఓట్లే లక్ష్యంగా విజయసాయి రెడ్డి పార్టీని స్థాపించారా? అని ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే, నేటితరం యువతను భవిష్యత్ రాజకీయ నేతలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక వేదికగా ఈ పార్టీ నిలుస్తుందని ఆయన ప్రకటించడం గమనార్హం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తమ పార్టీ జెండా పనిచేస్తుందని విజయసాయిరెడ్డి స్పష్టంచేశారు. కాగా, గతంలో వైసీపీలో పనిచేసిన విజయసాయి..
ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి ప్రజల ఓట్లను చీల్చడం వెనుక మాజీ సీఎం జగన్ హస్తముందని చర్చ జరుగుతోంది. అదే జరిగితే క్రిస్టియన్, ముస్లిం ఓట్లతో వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరగుతోంది.అందుకే విజయసాయిరెడ్డి ఇటీవలి కాలంలో హిందువులకు మద్దతుగా మాట్లాడుతున్నారని సమాచారం.


