Tollywood: టాలీవుడ్లో దర్శకుడు సుకుమార్ శిష్యులకు మంచి గుర్తింపు దక్కుతోంది. ఆయన దగ్గర దర్శకత్వం శాఖలో పని చేసిన పలువురు దర్శకులు ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇదే టీమ్ నుంచి మరో దర్శకుడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డతో సినిమా చేయబోతున్నాడు. తాజాగా, ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభమైంది.
సుకుమార్ శిష్యుడికి సిద్ధు జొన్నలగడ్డతో బంపర్ ఆఫర్!
ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నది బి. మోహన్. సుకుమార్ టీమ్‌లో కథా రచయితగా పనిచేసిన ఆయన ఇప్పుడు మెగాఫోన్ పట్టబోతున్నారు. సిద్ధు జొన్నలగడ్డ కెరీర్లో ఇది పదో సినిమా కావడం విశేషం. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో హీరోయిన్గా రాకాస సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నయన్ సారిక ఎంపికైంది.
ప్రేమకథతో కొత్త ప్రయోగం చేయబోతున్న దర్శకుడు!
ఈ సినిమాను సరికొత్త ప్రేమకథతో రూపొందించబోతున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. చంద్రు సెల్వరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 11న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా చిత్రబృందం షెడ్యూల్స్ ప్లాన్ చేస్తోంది.
సుకుమార్ శిష్యులు వీరే..
రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా వచ్చిన కుమారి 21ఎఫ్ సినిమాతో సుక్కూ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమాను సుకుమార్ సమర్పించాడు. మొదటి సినిమాతో సాలీడ్ హిట్ అందుకున్నాడు సూర్య ప్రతాప్. కానీ, ఆ తర్వాత నుంచి అంతగా ఆయన పేరు వినిపించడం లేదు.
ఉప్పెనతో వచ్చిన బుచ్చిబాబు..
మెగా ఫ్యామిలీ హీరో పంజా వైష్ణవ్ తేను పరిచయం చేస్తూ సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సానా టాలీవుడ్‌కి పరిచయమైయ్యాడు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దీని, తర్వాత తీసిన పెద్ది..విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ, కమర్షియల్‌గా మాత్రం ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది.
దసరా, ది ప్యారడైజ్ సినిమాలతో ప్రూవ్ చేసుకున్న శ్రీకాంత్ ఓదెల:
నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన దసరా సినిమా 100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ సినిమాతో సుకుమార్ బృందం నుంచి ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు శ్రీకాంత్ ఓదెల. రెండవ సినిమాగా వచ్చిన ది ప్యారడైజ్ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో, మెగాస్టార్‌తో శ్రీకాంత్ చేయాల్సిన ప్రాజెక్ట్ హోల్డ్ అయింది. ఇప్పుడు, బి.మొహన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మరి, ఈ దర్శకుడు ఏ స్థాయిలో నిలదొక్కుకుంటాడో చూడాలి.


