Telangana Politics: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు మూడేళ్లు గడుస్తున్నా.. నేతల మధ్య ఆధిపత్య పోరు మాత్రం చల్లారడం లేదు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, పెద్దపల్లి పరిధిలో సీనియర్ మంత్రులు, స్థానిక ఎంపీ మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దూకుడుకు కళ్లెం వేసి, లోక్‌సభ సెగ్మెంట్‌పై ఆయన పట్టును బలహీనపరిచేలా మంత్రులు, ఎమ్మెల్యేలు ఉమ్మడిగా వ్యూహాత్మక స్కెచ్ వేశారన్న చర్చ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
అధిపత్యానికి బ్రేక్ వేసే ప్లాన్!
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో పాటు కీలక ఎమ్మెల్యేలు ఏకతాటిపైకి వచ్చి ఎంపీని క్రమంగా ఐసోలేట్ చేసే వ్యూహాన్ని అమలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎంపీ వంశీకృష్ణ తండ్రి, మంత్రి వివేక్ వెంకటస్వామి కుటుంబానికి జిల్లాలో బలమైన కేడర్, పట్టు ఉండటం ఇతర మంత్రులకు మింగుడుపడటం లేదన్నది బహిరంగ రహస్యమే. తమ ఇలాకాల్లో వివేక్ కుటుంబం సమాంతర శక్తిగా ఎదగకుండా ఉండేందుకే.. ప్రభుత్వ అధికారిక ప్రోటోకాల్ మొదలుకుని నియోజకవర్గ స్థాయి సమీక్షల వరకు ఎంపీని పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ శిలాఫలకాలపై ఎంపీ పేరు కనిపించకుండా చేయడం, అధికారులకు అనధికారిక ఆదేశాలు ఇచ్చి ఎంపీ పర్యటనలకు దూరంగా ఉంచడం ఈ స్కెచ్‌లో భాగమేనని ఎంపీ వర్గీయులు మండిపడుతున్నారు.
ఎమ్మెల్యేల వ్యతిరేక వర్గానికి ఎంపీ వల.. తగ్గేదేలే!
మంత్రులు, ఎమ్మెల్యేలు చుట్టుముట్టి చెక్ పెట్టాలని చూస్తున్నా ఎంపీ వంశీకృష్ణ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎదురుదాడికి దిగుతూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉన్న పాత కాంగ్రెస్ నేతలు, అసంతృప్త నేతలను దగ్గరకు తీసుకుంటున్నారు. ‘విశాఖ చారిటబుల్ ట్రస్ట్’ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రౌండ్ లెవెల్ కేడర్‌ను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారు చేస్తామంటూ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు.
సస్పెన్షన్ల రాజకీయం.. గాంధీభవన్‌కు పంచాయితీ!
ఈ ఆధిపత్య పోరులో భాగంగానే క్షేత్రస్థాయి కార్యకర్తలపై సస్పెన్షన్ వేట్లు పడుతున్నాయన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. మల్హర్ మండలం కొయ్యూరులో ఎంపీ నిర్వహించిన స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారన్న నెపంతో కొందరు స్థానిక నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం రచ్చకు దారితీసింది. మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతోనే తమపై కక్షసాధింపు చర్యలకు దిగారని బాధితులు నేరుగా గాంధీభవన్‌కు వచ్చి టీపీసీసీ ముందు లబోదిబోమన్నారు. సొంత పార్టీ ఎంపీ కార్యక్రమంలో పాల్గొంటే సస్పెండ్ చేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.
మొత్తానికి పెద్దపల్లి వేదికగా జరుగుతున్న ఈ అంతర్గత కుర్చీలాట కాంగ్రెస్ కేడర్‌ను తీవ్ర అయోమయానికి గురిచేస్తోంది. మంత్రులు, ఎంపీ ఎవరికి వారే పైచేయి సాధించాలని చూస్తుండటంతో పార్టీ పరువు రోడ్డున పడుతోంది. అధిష్ఠానం వెంటనే జోక్యం చేసుకుని ఈ గ్రూపుల పంచాయితీకి తెరదించకపోతే.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.


