Aqwan Cyclone: ఆంధ్రప్రదేశ్‌ను వరుస ప్రకృతి విపత్తులు వెంటాడుతున్నాయి. మొన్నటికి మొన్న తీరాన్ని వణికించిన అర్నబ్ తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోకముందే, ‘మొరుసు’ తుఫాన్ పంట పొలాలను ముంచెత్తి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కేవలం రెండు మూడు రోజుల వ్యవధిలోనే విరుచుకుపడిన ఈ జంట తుఫాన్ల దెబ్బతో కోలుకోలేక విలవిలలాడుతున్న అన్నదాతలకు, తీరప్రాంత ప్రజలకు వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. బంగాళాఖాతంలో మరో పెను తుఫాన్ పురుడుపోసుకుంటోంది.
బంగాళాఖాతంలో కదలికలు.. 13న అల్పపీడనం
వాతావరణ నిపుణుల తాజా అంచనాల ప్రకారం.. ఈ నెల 13న బంగాళాఖాతంలో సరికొత్తగా అల్పపీడనం ఏర్పడనుంది. ఇది ఏర్పడిన కేవలం 24 గంటల్లోనే తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మరింత తీవ్రరూపం దాల్చి, ఈ నెల మూడో వారంలో పూర్తి స్థాయి సైక్లోన్‌గా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ అల్పపీడనం బలపడి తుఫాన్‌గా మారిన తర్వాతే ఇది ఏ దిశగా కదులుతుంది? ఏ తీరం వైపు దూసుకొస్తుంది? తీరం దాటే సమయంలో దీని గాలుల తీవ్రత ఎంతవరకు ఉండబోతుందనే దానిపై పూర్తి క్లారిటీ రానుంది.
ఇరాన్ పెట్టిన పేరు.. ‘తుఫాన్ రక్కసి’
అంతర్జాతీయ వాతావరణ సంస్థల రూల్స్ ప్రకారం.. హిందూ మహాసముద్ర పరిధిలో వచ్చే తుఫాన్లకు వివిధ దేశాలు వంతులవారీగా పేర్లు పెడతాయి. ఈసారి రాబోయే తుఫాన్‌కు నామకరణం చేసే వంతు ఇరాన్ దేశానికి వచ్చింది. ఈ క్రమంలో ఇరాన్ ఈ తుఫాన్‌కు ‘ఆక్వాన్’ (Aqwan) అని పేరు ఖరారు చేసింది. స్థానిక భాషా పరిభాషలో ‘ఆక్వాన్’ అంటే ‘తుఫాన్ రక్కసి’ అనే భయంకరమైన అర్థం వస్తుంది. పేరులోనే ఇంతటి తీవ్రత ఉండటంతో, తీర ప్రాంతాలపై ఇది ఎలాంటి విలయం సృష్టిస్తుందోనన్న గుబులు మొదలైంది.
తీరంలో గుబులు.. అన్నదాతల ఆవేదన
రెండు మూడు రోజుల తేడాతో వచ్చిన ‘అర్నబ్, మొరుసు తుఫాను తీవ్ర ప్రభావంతో కురిసిన వర్షాలు, ఈదురుగాలులతో ఇప్పటికే కోస్తా జిల్లాల్లోని రైతాంగాన్ని ఆగమాగం చేశాయి. చేతికందిన వరి, మిగితా పంటలు నీటమునిగి తీవ్ర నష్టం వాటిల్లింది. పంటను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇప్పుడు ‘ఆక్వాన్’ రూపంలో మరో ముప్పు పొంచి ఉండటం రైతులను, సముద్ర తీర గ్రామాల ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. దీంతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమై, తీర ప్రాంతాల్లో ముందస్తు సహాయక చర్యలపై దృష్టి సారిస్తోంది.


