కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఈ క్రమంలోనే పాల ధరలను మరోసారి పెంచుతూ 'మదర్ డెయిరీ' ప్రకటించింది. లిక్విడ్ పాల ధరలను లీటరుకు రూ. 2 నుండి రూ. 4 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన కొత్త ధరలు రేపు (గురువారం) నుండి అమలులోకి రానున్నాయి. పాలను సేకరణ ఖర్చులు , ఇతర ఉత్పత్తి వ్యయాలు పెరగడం వల్లే ధరలను పెంచాల్సి వచ్చిందని మదర్ డెయిరీ వర్గాలు వెల్లడించాయి.
తాజా పెంపుదలతో దేశవ్యాప్తంగా ధరలు పెరిగినట్టు సమాచారం. మదర్ డెయిరీకి అత్యంత ప్రధాన మార్కెట్ అయిన ఢిల్లీ-ఎన్‌సీఆర్ రీజియన్‌లో పాల ఉత్పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఫుల్ క్రీమ్ పాలు లీటరుపై రూ. 4 పెరిగింది. అనగా పాత ధర రూ. 72 ఉండగా.. ఇప్పుడు రూ. 76కి చేరింది. ఆవు పాలు లీటరుపై రూ. 3 పెరిగింది. దీనిప్రకారం పాత ధర రూ. 62 నుంచి రూ. 65కు చేరుకుంది. టోన్డ్ మిల్క్ లీటరుపై రూ.2 పెరిగింది. దీని ప్రకారం పాత ధర రూ. 60 ఉండగా.. ఇప్పుడు రూ. 62కు చేరుకుంది.డబుల్ టోన్డ్ మిల్క్ లీటరుపై రూ. 2 పెరిగి, పాత ధర రూ. 54 నుండి రూ. 56 కి చేరింది. బల్క్ వెండెడ్ మిల్క్ లీటరు ధర రూ. 58 నుండి రూ. 60కు పెరిగింది.
ఇక హైదరాబాద్ మహానగరం విషయానికొస్తే మదర్ డెయిరీ ప్రకటించిన ఈ ధరల పెంపు లీటరుకు రూ. 2 నుండి రూ. 4 వరకు పెరిగింది. హైదరాబాద్, తెలుగు రాష్ట్రాల మార్కెట్లలో మదర్ డెయిరీ కంటే 'విజయ డెయిరీ', అమూల్, హెరిటేజ్, జెర్సీ మరియు దొడ్ల డెయిరీ వంటి బ్రాండ్ల వాటా చాలా ఎక్కువ. హైదరాబాద్ స్థానిక మార్కెట్లో లభ్యమయ్యే మదర్ డెయిరీ పాల ప్యాకెట్లపై కూడా ఇదే తరహాలో లీటరుకు రూ. 2 నుండి రూ. 4 వరకు అదనపు భారం పడనుంది.
మదర్ డెయిరీ దేశవ్యాప్తంగా రోజుకు 50 లక్షల లీటర్లకు పైగా పాలను విక్రయిస్తుండగా, కేవలం ఢిల్లీ-ఎన్సీఆర్ మార్కెట్లోనే రోజుకు సుమారు 35 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తోంది. నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ అనుబంధ సంస్థగా 1974లో ప్రారంభమైన మదర్ డెయిరీ.. గత ఆర్థిక ఏడాదిలో 17 శాతం వృద్ధితో రూ.20,300 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. ఈ సంస్థ 'మదర్ డెయిరీ' బ్రాండ్ పేరుతో పాలు, 'ధార' పేరుతో వంటనూనెలు, 'సఫల్' పేరుతో పండ్లు, కూరగాయలను సైతం విక్రయిస్తున్నది. ఇదిలాఉండగా, ఈ మధ్యకాలంలో అన్ని పాలబ్రాండ్స్ ధరలను పెంచి వినియోగదారులపై భారాన్ని మోపాయి.


