తెలంగాణ

TIMS: నిమ్స్ పేషెంట్లకు టిమ్స్‌లో సర్జరీలు- మంత్రి దామోదర రాజనర్సింహ కీలక ఆదేశాలు

5 నిమిషాల పఠనం

సర్జరీల వెయిటింగ్ తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నిమ్స్‌ ఆసుపత్రిలో ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తున్న పేషెంట్లకు సనత్‌నగర్‌లోని డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్‌లో సర్జరీలు నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు.

TIMS: హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో పలు రకాల సర్జరీల కోసం రోగులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. ఈ అంశంపై ప్రభుత్వం స్పందించింది. సర్జరీల వెయిటింగ్ తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నిమ్స్‌ ఆసుపత్రిలో ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తున్న పేషెంట్లకు సనత్‌నగర్‌లోని డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్‌లో సర్జరీలు నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. నిమ్స్‌లో పెరుగుతున్న పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అందుబాటులో ఉన్న అన్ని వసతులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. బంజారాహిల్స్‌లోని తన అధికారిక నివాసంలో నిమ్స్‌లోని వివిధ విభాగాల హెచ్‌వోడీలతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఆపరేషన్ల కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి

నిమ్స్‌పై ప్రజల్లో ఉన్న నమ్మకం, విశ్వాసంతో హాస్పిటల్‌కు వచ్చే పేషెంట్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని మంత్రికి వివరించారు డాక్టర్లు. నిమ్స్‌లో సర్జన్లు తగినంత మంది ఉన్నప్పటికీ, ఆపరేషన్ థియేటర్లు పరిమితంగా ఉండటంతో యూనిట్ల వారీగా రొటేషన్ పద్ధతిలో సర్జరీలు నిర్వహించాల్సి వస్తోందని తెలిపారు. దీంతో కొన్ని రకాల ఆపరేషన్ల కోసం పేషెంట్లు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోందని వివరించారు.

టిమ్స్‌లో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, వైద్య సదుపాయాలు

దీనిపై స్పందించిన మంత్రి.. సనత్‌నగర్‌లోని డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్‌లో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, ఇతర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని.. వాటిని నిమ్స్ వైద్యులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. నిమ్స్‌లో సర్జరీల కోసం వెయిటింగ్‌లో ఉన్న పేషెంట్లకు టిమ్స్‌లో ఆపరేషన్లు నిర్వహించేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రతి పేషెంట్‌కు సకాలంలో నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యం

ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే ప్రతి పేషెంట్‌కు సకాలంలో నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. రెండు హాస్పిటళ్లు సమన్వయంతో పని చేసి పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇందులో భాగంగా నిమ్స్ హెచ్‌వోడీలంతా వెంటనే డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్‌ను సందర్శించి, అక్కడ అందుబాటులో ఉన్న ఆపరేషన్ థియేటర్లు, వైద్య పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించాలని ఆదేశించారు.

వైద్య పరికరాలు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధం

సర్జరీల నిర్వహణకు అదనంగా ఏవైనా వైద్య పరికరాలు లేదా ఇతర సదుపాయాలు అవసరమైతే వాటిని సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. రెండు హాస్పిటళ్ల మధ్య సమన్వయంతో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను గరిష్ఠంగా వినియోగించుకుంటూ పేషెంట్లకు సర్జరీలు త్వరితగతిన జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. టిమ్స్‌లో డాక్టర్ల నియామక ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ప్రిన్సిపల్ సెక్రటరీకి మంత్రి సూచించారు. నియామకాలు పూర్తయ్యే వరకూ నిమ్స్ డాక్టర్ల సహకారం కొనసాగించాలన్నారు.

#TIMS#Hyderabad#NIMS#Surgeries#Telangana#Damodar Rajanarsimha Cilarapu#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి