TG: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'భారత్ సమ్మిట్' హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. 70 దేశాల నుంచి వెయ్యి మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సు, రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజేసింది. ఈ సమ్మిట్‌కు ముఖ్య అతిథిగా హాజరవుతున్న లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాధనంతో కాంగ్రెస్ పార్టీ సొంత ప్రచారం చేసుకుంటోందని విపక్షాలు ఆరోపిస్తుండగా, మంత్రులు సైతం అంతే ఘాటుగా బదులిస్తున్నారు.
రాహుల్ పనిచేసేది భారత వ్యతిరేక శక్తుల కోసమే : కిషన్ రెడ్డి
'భారత్ సమ్మిట్' నిర్వహణపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. అసలు ఇది భారత్ సమ్మిట్ కాదని, ముమ్మాటికీ 'భారత వ్యతిరేక సమ్మిట్' అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ సొమ్ముతో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. దేశ అభివృద్ధిని, రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేసే కుట్రతో పాటు, ప్రధాని మోడీపై తప్పుడు ఆరోపణలు చేసేందుకే ఈ వేదికను వాడుకుంటున్నారని మండిపడ్డారు. భారత వ్యతిరేక శక్తుల కోసమే రాహుల్ గాంధీ పనిచేస్తున్నారని, దేశంలో పెట్టుబడులను అడ్డుకోవడానికే ఈ సమ్మిట్ పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ తీరుతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, ముందుగా ప్రజలకు ఇచ్చిన హామీలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఢిల్లీలో నిద్రపోతున్నారా?.. రాహుల్‌పై కేటీఆర్ ప్రశ్నల వర్షం
మరోవైపు, రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో నిరుద్యోగ విద్యార్థుల గొంతు నులిమినప్పుడు ఏమయ్యారు? లగచర్ల ఘటనలో గిరిజన మహిళలను అవమానించినప్పుడు ఎందుకు స్పందించలేదు? అంటూ కేటీఆర్ నిలదీశారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూలుస్తుంటే ఢిల్లీలో నిద్రపోతున్నారా అని ప్రశ్నించిన ఆయన.. హెచ్‌సీయూ భూముల్లో చెట్ల నరికివేత, కేబీఆర్ పార్కు విధ్వంసం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలపై ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగారు. మహిళా ప్రజాప్రతినిధులపై దాడులు, రైతులు, నేత కార్మికుల ఆత్మహత్యలపై మాట్లాడేందుకు సమయం లేదా అని ప్రశ్నించారు. సొంత పార్టీ నేతలే ప్రభుత్వ అవినీతిపై మాట్లాడుతున్నారని, తెలంగాణ ప్రజల సొమ్ముతో ప్రచార ఆర్భాటం చేస్తున్నారని విమర్శించిన కేటీఆర్.. ప్రజల ప్రశ్నలకు జవాబు చెప్పే ధైర్యం రాహుల్ గాంధీకి ఉందా అని సవాల్ విసిరారు.
విపక్షాలకు ఓర్వలేనితనం.. మంత్రుల స్ట్రాంగ్ కౌంటర్
బీజేపీ, బీఆర్ఎస్ నేతల విమర్శలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. "నిత్యం విందులు, వినోదాల్లో మునిగితేలే వారికి భారత్ సమ్మిట్ అలాగే కనిపిస్తుంది. ప్రజాస్వామ్యం, సమాజం, శాంతి కోసమే ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. గిగ్ వర్కర్లకు ప్రభుత్వం ఏం చేయబోతోందో రేపు రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటిస్తారు" అని భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. "రాహుల్ గాంధీ స్థాయి గురించి మాట్లాడే అర్హత బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు లేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ, దేశాన్ని ఐక్యంగా ఉంచుతున్నందుకే బీజేపీ నేతలు భయపడుతున్నారు. అసలు పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఏం చేసిందో ముందు సమాధానం చెప్పాలి" అంటూ మండిపడ్డారు. కాగా, రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో 'తెలంగాణ రైజింగ్' థీమ్‌తో పాటు ఫ్యూచర్ సిటీ, ఏఐ (AI), క్లౌడ్ క్యాపిటలిజం, గ్లోబల్ సౌత్ సహకారం, రాష్ట్రంలో పెట్టుబడులపై అంతర్జాతీయ ప్రతినిధులతో కీలక చర్చలు జరగనున్నాయి.


