తెలంగాణ

ప్రతి కుటుంబానికి రూ.5లక్షల జీవిత బీమా.. నవంబర్ 19న ప్రారంభం- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

6 నిమిషాల పఠనం

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా సౌకర్యం కల్పించడం ద్వారా దేశంలోనే ఈ విధానాన్ని అమలు చేస్తున్న తొలి, ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

* దేశంలోనే ప్రతి కుటుంబానికి జీవిత బీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ‎

* నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రారంభం‎

* ‎ప్రతి కుటుంబంలో ఒక ఉపాధి పొందే వ్యక్తికి రూ.5 లక్షల జీవిత బీమా‎

* ‎ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది నామినీలను ఎంపిక చేసుకునే అవకాశం‎

* ‎కుల, మత, ఆదాయ భేదాలు లేకుండా ప్రతి కుటుంబానికి బీమా సౌకర్యం-ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క‎‎

Indiramma Bheema: ‎రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా సౌకర్యం కల్పించడం ద్వారా దేశంలోనే ఈ విధానాన్ని అమలు చేస్తున్న తొలి, ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.‎

ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదన్న లక్ష్యం

‎గతంలో రాష్ట్రంలో అమలైన కొన్ని బీమా పథకాలు నిర్దిష్ట శాఖలు, కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే పరిమితమయ్యాయని పేర్కొన్నారు. కుటుంబంలో ఉపాధి పొందుతున్న వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదన్న లక్ష్యంతో ప్రతి కుటుంబానికి జీవిత బీమా కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు.‎

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5లక్షల జీవిత బీమా

‎ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నిజమైన సార్వత్రిక జీవిత బీమా పథకమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కులం, మతం, ఆదాయంతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా వర్తిస్తుందని, ఈ పథకాన్ని ముఖ్యమంత్రి అధికారికంగా ప్రారంభిస్తారని వెల్లడించారు. ‎శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. నవంబర్ 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామం, పట్టణం, నగరంలో ఏకకాలంలో, సంతృప్త స్థాయిలో లబ్ధిదారుల నమోదు ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు.‎

కుటుంబసభ్యులే నిర్ణయించుకోవచ్చు

‎ఈ పథకంలో ప్రత్యేకత కేవలం బీమా పరిధికే పరిమితం కాదని, కుటుంబాలకు అనేక వెసులుబాట్లు కల్పిస్తున్నామని వివరించారు. ప్రతి కుటుంబంలో ఒకరు ఉపాధి పొందుతున్నట్లయితే ఆ వ్యక్తికి బీమా వర్తిస్తుందని, ఒక కుటుంబంలో పలువురు ఉపాధి పొందుతున్నట్లయితే వారిలో ఎవరికి బీమా కల్పించాలనేది కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవచ్చని తెలిపారు. అలాగే ఒకరిని లేదా పలువురిని నామినీలుగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని, బీమా మొత్తాన్ని నామినీలకు ఏ నిష్పత్తిలో పంపిణీ చేయాలన్నది కూడా కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవచ్చని పేర్కొన్నారు.‎

‎అన్ని వివరాలు కచ్చితంగా నమోదు చేయాలి

లబ్ధిదారుల నమోదు సమయంలో అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. బీమా పొందే వ్యక్తి పేరు, నామినీల వివరాలు సహా అన్ని వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని, సంతకం తీసుకునే ముందు నమోదు చేసిన వివరాలను కుటుంబసభ్యులకు చదివి వినిపించి, వారి అంగీకారాన్ని నిర్ధారించుకోవాలని ఆదేశించారు.‎

నవంబర్ 17, 18 తేదీల్లో గ్రామాల్లో విస్తృత ప్రచారం

‎పథకంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు నవంబర్ 17, 18 తేదీల్లో గ్రామాల్లో టామ్‌టామ్ ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. నమోదు కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే వివరాలను ప్రజలకు ముందుగానే తెలియజేయాలని, సామాజిక మాధ్యమాలతో పాటు అన్ని రకాల ప్రసార మాధ్యమాలను వినియోగించి పథకంపై విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులకు సూచించారు.

#Indiramma Bheema#Indiramma Bheema Insurance Scheme#Telangana#Telangana Deputy Chief Minister Mallu Bhatti Vikramarka#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి