అంతర్జాతీయం

Nuclear Bomb in Space: ఆకాశంలో ఆ ఒక్క బాంబు పేలితే.. ప్రపంచం కుప్పకూలిపోతుందా!

5 నిమిషాల పఠనం

Nuclear Bomb in Space: భూమి మీద యుద్ధాలు జరగాల్సిన పనిలేదు.. నగరాలపై క్షిపణులు పడాల్సిన అవసరమూ లేదు. మన కంటికి కనిపించని అంతరిక్షంలో ఒక్క అణుబాంబు పేలితే చాలు, భూమి మీద ఉన్న మొత్తం ప్రపంచమే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది.

Nuclear Bomb in Space: భూమి మీద యుద్ధాలు జరగాల్సిన పనిలేదు.. నగరాలపై క్షిపణులు పడాల్సిన అవసరమూ లేదు. మన కంటికి కనిపించని అంతరిక్షంలో ఒక్క అణుబాంబు పేలితే చాలు, భూమి మీద ఉన్న మొత్తం ప్రపంచమే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. మొబైల్ ఫోన్లు మూగబోతాయి, ఇంటర్నెట్ కట్ అవుతుంది, జీపీఎస్ నావిగేషన్ ఆగిపోతుంది, వాతావరణ హెచ్చరికలు అందవు.. ఇలా మనిషి రోజువారీ జీవితం మొత్తం అస్తవ్యస్తమైపోతుంది. ఏదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా అనిపిస్తున్నా, అమెరికా శాస్త్రవేత్తలు చేసిన తాజా పరిశోధనలో తేలిన భయంకరమైన నిజం ఇది.

15 రోజుల్లోనే 99.4% ఉపగ్రహాలు ఖతం..

ప్రస్తుతం భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యలో 13,000కు పైగా ఉపగ్రహాలు నిరంతరం తిరుగుతున్నాయి. మనం వాడే కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఇంటర్నెట్, బ్యాంకింగ్, నావిగేషన్ ఇలా ప్రతిదీ వీటిపైనే ఆధారపడి నడుస్తోంది. అయితే, విస్కాన్సిన్-మాడిసన్, ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ పరిశోధకులు కంప్యూటర్ సిములేషన్ ద్వారా చేసిన స్టడీలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

భూమి అయస్కాంత క్షేత్రం బలహీనంగా ఉండే దక్షిణ అట్లాంటిక్ సముద్రం (సౌత్ అట్లాంటిక్ అనామలి) పైన, సుమారు 500 కిలోమీటర్ల ఎత్తులో ఒక మెగాటన్ సామర్థ్యం గల అణుబాంబు పేలితే జరిగే విధ్వంసం ఊహకు కూడా అందదు. ఆ పేలుడు నుంచి వచ్చే రేడియోధార్మిక కణాలు భూమి అయస్కాంత క్షేత్రంలో చిక్కుకుని ప్రమాదకరమైన 'కృత్రిమ రేడియేషన్ బెల్టులుగా' మారతాయి. వాటి గుండా ప్రయాణించే ఉపగ్రహాల ఎలక్ట్రానిక్ వ్యవస్థలు కాలిపోయి గంటల్లోనే విధ్వంసం మొదలవుతుంది:

పేలుడు జరిగిన మొదటి రోజుకే** 25% ఉపగ్రహాలు పనిచేయడం ఆగిపోతాయి. మూడో రోజుకు 78% శాటిలైట్లు బంద్ అయిపోతాయా. వారం రోజుల్లో 98% కనుమరుగవుతాయి. సరిగ్గా 15 రోజుల్లోనే 99.4% ఉపగ్రహాలు పూర్తిగా నాశనమవుతాయి. ఉపగ్రహాలకు ఎంత మెరుగైన రేడియేషన్ రక్షణ కల్పించినా, నెల రోజుల్లో 99.3% నష్టం తప్పదని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

డేంజర్ జోన్‌గా అంతరిక్షం..

నియంత్రణ కోల్పోయిన వేలాది ఉపగ్రహాలు ఆకాశంలో ఒకదానికొకటి బలంగా ఢీకొంటాయి. దీనివల్ల రెండేళ్లలో కనీసం 20 భారీ ప్రమాదాలు జరిగి, పదేళ్లలో దాదాపు 3,900 కొత్త అంతరిక్ష వ్యర్థాలు పేరుకుపోతాయి. ఇవి మిగిలిన వాటిని కూడా ఢీకొడుతూ అంతరిక్షాన్ని అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా మారుస్తాయి. ఫలితంగా భవిష్యత్తులో మనం కొత్త ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం కూడా సురక్షితం కాదు.

1962లోనే ట్రైలర్ కనిపించింది..

అంతరిక్షంలో అణు విస్ఫోటనాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. కోల్డ్ వార్ సమయంలో అమెరికా, సోవియట్ యూనియన్ కలిసి 18 హై-ఆల్టిట్యూడ్ పరీక్షలు చేశాయి. 1962లో అమెరికా 400 కిలోమీటర్ల ఎత్తులో చేసిన 'స్టార్ ఫిష్ ప్రైమ్' (1.4 మెగాటన్లు) పరీక్ష వల్ల అప్పట్లోనే చాలా ఉపగ్రహాలు కాలిపోయాయి. ఆ ప్రమాదాన్ని గుర్తించే 1963లో పలు దేశాలు అణు పరీక్షల నిషేధ ఒప్పందానికి అంగీకరించాయి.

కానీ ఇప్పుడు 13 వేలకు పైగా ఉపగ్రహాలతో భూమి చుట్టూ కమ్యూనికేషన్ వలయం అల్లుకున్న తరుణంలో.. అంతరిక్షంలో జరిగే ఒక్క అణు విస్ఫోటనం భూమి మీద కోట్లాది మంది జీవితాలను ఏళ్ల తరబడి చీకట్లోకి నెట్టేస్తుందని శాస్త్రవేత్తలు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

#Nuclear Bomb in Space#Space Nuclear Explosion#Nuclear Weapons#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి