Indiramma Illu: పేదల సొంతింటి కల నెరవేర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద, అల్పాదాయ వర్గాలకు ఇళ్లు నిర్మించి ఇస్తోంది. వారి సొంతింటి కల నెరవేర్చడంతో పాటు స్థిరమైన నివాసం కల్పిస్తోంది. ఇంటి అద్దెల భారం తప్పడంతో ఆయా కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఊరట లభిస్తోంది.
రూ.220 కోట్లతో 4 ప్రాంతాల్లో ఆటోనగర్ కాలనీల నిర్మాణం
తాజాగా హైదరాబాద్ నగరంలోని ఆటో రిక్షా కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆటో కార్మికుల సొంతింటి కల సాకారం కానుంది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలోని ఆటో కార్మికుల కోసం కొత్త గృహ నిర్మాణ పథకాన్ని ప్రకటించింది ప్రభుత్వం. ఇందులో భాగంగా ఆటో రిక్షా కార్మికుల కోసం ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇళ్ల టవర్లు నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది. బండ్లగూడ, గంధంగూడ, పేట్ బషీర్బాగ్, జల్ పల్లి లక్ష్మీగూడలో హౌసింగ్ బోర్డ్ ఆధ్వర్యంలో ఆటోనగర్ కాలనీలు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.220 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆటో కార్మికులకు సొంతింటి సౌకర్యం కల్పించడంతో పాటు వారి కుటుంబాలకు మెరుగైన నివాస వసతులు అందించడమే ఈ స్కీమ్ లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
ఒక్కో ప్రాంతంలో 500 చొప్పున 2వేల ఎల్ఐజీ ఫ్లాట్లు
ఒక్కో ప్రాంతంలో 500 చొప్పున మొత్తం 2 వేల ఎల్ఐజీ ఫ్లాట్లు నిర్మిస్తారు. ఇవి ఇందిరమ్మ టవర్స్ పథకం కిందనే వస్తాయి. ఇప్పటికే క్యూర్ పరిధిలో అల్పాదాయ కుటుంబాలకు నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్ల పథకానికి వర్తించే విధివిధానాలు, అర్హత నిబంధనలు, కేటాయింపు విధానం ఆటోనగర్ కాలనీలకు కూడా వర్తిస్తాయని జీవోలో స్పష్టం చేశారు.
మెరుగవనున్న ఆర్థిక పరిస్థితులు, జీవన ప్రమాణాలు
నగరంలో లక్షల సంఖ్యలో ఆటో కార్మికులు ఉన్నారు. వారిలో చాలామంది అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారు. సొంతిల్లు లేక వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. సంపాదించిన డబ్బులో ఎక్కువ మొత్తం ఇంటి అద్దెకు వెచ్చించాల్సి వస్తోంది. దీంతో వారి కుటుంబాలు స్థిరత్వం లేకుండా ఉంటున్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్మించి ఇచ్చే ఇళ్లు.. ఆటో కార్మికుల ఆర్థిక పరిస్థితులు, జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి దోహదం చేస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


