TG: సీఎం రేవంత్ రెడ్డి అండదండలు ఉన్నాయనే ధీమాతోనే కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వికారాబాద్ జిల్లాలో భూకబ్జాలకు పాల్పడుతూ సామాన్యులను వేధిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. కబ్జాకు గురైనట్లు చెబుతున్న భూమిని స్వయంగా పరిశీలించిన ఆయన, బాధిత రైతు మహ్మద్ అజ్మత్ పాషాను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికార పార్టీ నేతలు కోర్టు ఉత్తర్వులను సైతం లెక్కచేయకుండా దౌర్జన్యానికి దిగుతున్నారని ఆనంద్ మండిపడ్డారు.
అసలు వివాదం ఏంటంటే?
వికారాబాద్ జిల్లాలోని సర్వే నంబర్ 277లో మహ్మద్ అజ్మత్ పాషా 25 ఏళ్ల క్రితం ఐదున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అయితే, ఆ పొలం పక్కనే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సుమారు 10 ఎకరాల భూమిలో ప్లాటింగ్ డెవలప్మెంట్ చేపడుతున్నారని, ఆ వెంచర్‌కు దారి వేసుకోవడం కోసం తన భూమిని కబ్జా చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అజ్మత్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో స్థానిక పోలీసులు కూడా బల్మూరి వెంకట్‌కే సపోర్ట్‌గా ఉంటున్నారని బాధితుడు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఎదుట వాపోయారు.
రియల్ హీరో కుటుంబానికి వేధింపులు తగదు..
ఈ సందర్భంగా మెతుకు ఆనంద్ మాట్లాడుతూ.. "అజ్మత్ పాషా కుమారుడు ఆస్ట్రేలియాలో జరిగిన ఒక ఉగ్రదాడి సమయంలో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా 24 మందిని కాపాడి ఆ దేశంలో ఎంతో గౌరవం సంపాదించాడు. అతని సాహసానికి మెచ్చి ఆస్ట్రేలియా ప్రభుత్వం పౌరసత్వం ఇచ్చి ఘనంగా సత్కరించింది. కానీ, మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారిని గుర్తించకపోగా, వారి తండ్రి వద్ద ఉన్న భూమిని లాక్కోవడం దారుణం" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్మూరి వెంకట్ కోర్టు ఆర్డర్లను కూడా లెక్క చేయకుండా దౌర్జన్యం చేస్తున్నారని మెతుకు ఆనంద్ విమర్శించారు. ఇప్పటికైనా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి, కబ్జాకు గురైన భూమిని తక్షణమే అజ్మత్ పాషాకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, బల్మూరి వెంకట్ నుంచి బాధిత కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని కోరారు. ఈ ఆరోపణలపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, అధికార పార్టీ వర్గాల నుంచి స్పందన రావాల్సి ఉంది.


