* ఇంటర్ రద్దు తెలంగాణ బిడ్డల కోసం కాదు
* కార్పొరేట్ విద్యా వ్యాపారం కోసమే
* మంత్రివర్గ నిర్ణయం లేదు, బిల్లు లేదు, చర్చ లేదు
* ఒక్క సమీక్షా సమావేశంతో 5 దశాబ్దాల వ్యవస్థ రద్దు
* అసలు లబ్ధిదారులు నారాయణ, శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ సంస్థలే
* నవంబర్ 11 ఆదేశాన్ని తక్షణమే నిలిపివేయాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్
Inter System Abolish: రేవంత్ సర్కార్ తీసుకున్న ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ రద్దు నిర్ణయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రంగా స్పందించారు. ఎలాంటి సంప్రదింపులు, శాసనసభ చర్చ, చట్ట సవరణ లేకుండా కేవలం ఒక సమీక్షా సమావేశంలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు చేసే నిర్ణయం తెలంగాణ బిడ్డల కోసం కాదని, కార్పొరేట్ విద్యాసంస్థల స్వార్థ ప్రయోజనాల కోసమేనని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. నవంబర్ 11న ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగిన సమీక్షలో ఇచ్చిన ఆదేశాన్ని తక్షణమే నిలిపివేసి, ఈ అంశాన్ని శాసనసభ ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.
తుగ్లక్ పాలనను తలపించే నిర్ణయం
"మంత్రివర్గ నిర్ణయం లేదు. బిల్లు లేదు. సంప్రదింపులు లేవు. చర్చ లేదు. 10లక్షలకు పైగా విద్యార్థులు.. సుమారు 1,750 జూనియర్ కళాశాలలు, వేలాది మంది అధ్యాపకుల భవిష్యత్తును ఒక సమీక్షా గదిలో తేల్చేశారు. ఇది తుగ్లక్ పాలనను తలపించే నిర్ణయం" అని శ్రవణ్ మండిపడ్డారు. 1968లో అప్పటి విద్యాశాఖ మంత్రి, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు విశ్వవిద్యాలయాల వీసీలు, విద్యావేత్తలతో విస్తృతంగా చర్చించిన తర్వాతే ఇంటర్మీడియట్ వ్యవస్థను ప్రారంభించారని గుర్తు చేశారు. అలాంటి వ్యవస్థను 6 దశాబ్దాల తర్వాత ఒక అధికారుల సమావేశంతో కూలదోయడం దారుణమన్నారు.
అసలు లబ్ధిదారులు కార్పొరేట్ సంస్థలే
ఇప్పటికే ఒకే గొడుగు కింద పాఠశాలలు, జూనియర్ కళాశాలలు నడుపుతున్న నారాయణ, శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ సంస్థలే ఈ నిర్ణయంతో అసలైన లబ్ధిదారులని శ్రవణ్ ఆరోపించారు. ఇంటర్ రద్దుతో ఆ సంస్థలు తమ పాఠశాలలను 12వ తరగతి వరకు పొడిగించుకుని, 1 నుంచి 12వ తరగతి వరకు ప్రతి విద్యార్థిని తమ క్యాంపస్‌లలోనే బంధిస్తాయని, కేవలం ఇంటర్ నడిపే ప్రైవేట్ కళాశాలలు మూతపడి ఆ విద్యార్థులు కూడా కార్పొరేట్ వైపు నెట్టబడతారని హెచ్చరించారు. సీబీఎస్ఈ తరహా పాఠశాల ఆధారిత 11, 12 తరగతులు సామాన్య కుటుంబాలకు ఉన్నత మాధ్యమిక విద్యను మరింత భారంగా మారుస్తాయన్నారు.
సీఎం రేవంత్ కుటుంబ వ్యాపారం కోసమే..
''నారాయణ విద్యా సంస్థ వ్యవస్థాపకుడు పి.నారాయణ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రి. చంద్రబాబుతో సీఎం రేవంత్‌కు ఉన్న సుదీర్ఘ అనుబంధం అందరికీ తెలిసిందే. ఈ విధానంతో లాభపడే తరహా పాఠశాలలను సీఎం కుటుంబ సభ్యులే కొత్తగా స్థాపిస్తున్నారు. వాటిలో పెట్టుబడులు పెడుతున్నారని బహిరంగంగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నిర్ణయం తెలంగాణ బిడ్డల కోసం కాదు, కుటుంబ వ్యాపారం కోసం. విద్యాశాఖ మంత్రి కూడా అయిన ముఖ్యమంత్రి స్వయంగా పాల్పడిన స్పష్టమైన ప్రయోజనాల సంఘర్షణ ఇది" అని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.
ఐఐటీ వారసత్వానికే ఎసరు
దేశ జనాభాలో 3 శాతం కూడా లేని తెలంగాణ, జేఈఈ అడ్వాన్స్డ్ 2024 అర్హుల్లో 9.6 శాతం వాటాతో దేశంలో మూడో స్థానంలో నిలిచిందని, జేఈఈ మెయిన్ 100 పర్సంటైల్ జాబితాలో వరుసగా మూడేళ్లు అగ్రస్థానంలో ఉందని శ్రవణ్ గుర్తు చేశారు. ఈ విజయాలకు పునాది మన ఇంటర్మీడియట్ వ్యవస్థే అని తేల్చి చెప్పారు. దాన్ని కూల్చితే తెలంగాణ బిడ్డలు గెలుచుకుంటున్న ఐఐటీ, ఎన్ఐటీ సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఎగరేసుకుపోతారని హెచ్చరించారు. "ఐదు దశాబ్దాలుగా నిర్మించుకున్న ప్రతిభా వారసత్వాన్ని ఒక్క సమీక్షా సమావేశంలో విసిరిపారేస్తున్నారు" అని దుయ్యబట్టారు.
6 నెలల్లోనే మాట తప్పిన సీఎం
మే 10న ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్‌ను హఠాత్తుగా ఉపసంహరించుకున్నప్పుడు సీఎం మూడు హామీలు ఇచ్చారని శ్రవణ్ గుర్తు చేశారు. అన్ని పక్షాలతో సంప్రదింపులు, విద్యా విధాన కమిటీ అధ్యయనం, తుది నిర్ణయానికి ముందు శాసనసభలో చర్చ. ఆరు నెలలు గడిచినా వీటిలో ఒక్కటీ జరగలేదన్నారు. విద్యా కమిషన్ నివేదికను సభలో పెట్టకుండానే అందులోని ఒక్క రూపాయి ఖర్చు లేని రద్దు సిఫారసును మాత్రమే ఎంచుకున్నారని ఆయన విమర్శించారు. ప్రతి మండలంలో పబ్లిక్ స్కూళ్లు.. 11, 12 తరగతులకు మధ్యాహ్న భోజనం, ఫీజుల నియంత్రణ చట్టం వంటి నిధులు అవసరమైన సిఫారసులను పక్కన పడేశారని ఆరోపించారు.
తప్పుడు లెక్కలతో తప్పుడు నిర్ణయం
10వ తరగతి తర్వాత 40 శాతం మంది చదువు మానేస్తున్నారన్న ప్రభుత్వ వాదన అవాస్తవమని శ్రవణ్ ఖండించారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ యూడైస్+ 2024-25 గణాంకాల ప్రకారం తెలంగాణలో 10 నుంచి 11వ తరగతికి 72.8 శాతం మంది వెళ్తున్నారని, బాలికలు కాదు బాలురే ఎక్కువగా చదువు మానేస్తున్నారని ఆయన వివరించారు. 2026-27లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 11వ తరగతి ప్రవేశాలు 14 శాతం పెరిగి 85,453కు చేరాయన్నారు. ఇంటర్ కుప్పకూలలేదు, విస్తరిస్తోందని స్పష్టం చేశారు.
బడ్జెట్లో మోసం.. బడులకు తాళాలు
విద్యకు 15 శాతం బడ్జెట్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ 2026-27లో ఇచ్చింది 8.23 శాతం మాత్రమేనని శ్రవణ్ తెలిపారు. ఒక్క ఈ ఏడాదిలోనే లోటు రూ.21,961 కోట్లని లెక్కలతో సహా వివరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 97 శాతం ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, పాఠశాలల్లో 19,017 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 18 కొత్త జూనియర్ కళాశాలలు ఒక్క మంజూరైన పోస్టు కూడా లేకుండానే మొదలయ్యాయని వెల్లడించారు.
2025-26లోనే 1,441 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయన్నారు. విశ్వవిద్యాలయాలకు రూ. 500 కోట్లు కేటాయించి రూ. 5 కోట్లే విడుదల చేశారని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 10,000 కోట్లు దాటాయన్నారు. గురుకుల టెండర్లలో రూ.4వేల కోట్లకు పైగా అక్రమాల ఆరోపణలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. "పిచ్చోడి చేతిలో రాయిలా అనాలోచిత నిర్ణయాలు కొనసాగితే తెలంగాణ విద్యా వ్యవస్థ సర్వనాశనమవుతుంది" అని హెచ్చరించారు దాసోజు శ్రవణ్.
ఢిల్లీలో ఒక మాట.. హైదరాబాద్‌లో మరో బాట
రాష్ట్రాలను సంప్రదించకుండా జాతీయ విద్యా విధానంతో మోదీ ప్రభుత్వం దేశంపై బుల్డోజర్ నడిపిందని సోనియా గాంధీ విమర్శించారని.. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధానాన్ని తిరస్కరించిందని శ్రవణ్ గుర్తు చేశారు. "ఢిల్లీలో మీ పార్టీ ఖండించే బుల్డోజర్ పద్ధతినే హైదరాబాద్‌లో మీరు ఆచరిస్తున్నారు. ఇది ద్వంద్వ నీతికి పరాకాష్ట కాదా?" అని ఆయన ప్రశ్నించారు. దేశంలో ఏ విధానమూ చెప్పని విధంగా 5వ తరగతి పిల్లలను "సెకండరీ" విద్యార్థులుగా మార్చేసిన ఈ ప్రకటనకు సిలబస్ లేదు, పాఠ్య పుస్తకాల ప్రణాళిక లేదు, పరీక్షల ప్రణాళిక లేదని విమర్శించారు.
ఆదేశంతో చట్టాన్ని రద్దు చేయలేరు
ఇంటర్మీడియట్ విద్యా మండలి తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా చట్టం, 1971 కింద ఏర్పడిందని, ఆ చట్టాన్ని సవరించే అధికారం శాసనసభకు మాత్రమే ఉందని, పరిపాలనా ఆదేశంతో దాన్ని రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని శ్రవణ్ స్పష్టం చేశారు. కేంద్ర పథకాల నిధుల షరతులే ఈ తొందరకు కారణమైతే ఆ విషయాన్ని ప్రజల ముందు బహిరంగపరచాలని, షరతులకు తలొగ్గి ఐదు దశాబ్దాల తెలంగాణ విద్యా వారసత్వాన్ని బలి ఇవ్వొద్దని ఆయన హితవు పలికారు.
బీఆర్ఎస్ ప్రధాన డిమాండ్లు:
1. నవంబర్ 11 ఆదేశాన్ని తక్షణమే నిలిపివేసి, చట్ట సవరణ జరిగే వరకు 2027-28 ప్రవేశాలు ప్రస్తుత వ్యవస్థలోనే జరుగుతాయని ప్రకటించాలి.
2. సీఎం, ఆయన కుటుంబ సభ్యులకు వాటా ఉన్న విద్యాసంస్థల వివరాలు, కార్పొరేట్ సంస్థలతో జరిగిన సమావేశాలు బహిర్గతం చేయాలి.
3. విద్యా కమిషన్ నివేదికను సభ ముందుంచి, 2014 నుంచి ఇంటర్ విద్యపై శ్వేతపత్రం విడుదల చేయాలి.
4. ఉభయ సభల్లో చర్చ జరపాలి. ఏ బిల్లునైనా సెలెక్ట్ కమిటీకి పంపాలి. ఆర్డినెన్స్ దారిలో వెళ్లకూడదు.
5. విద్యావేత్తలు, రాజ్యాంగ నిపుణులు, ఉద్యోగ సంఘాలతో స్వతంత్ర నిపుణుల కమిటీ వేసి, దాని నివేదిక బహిరంగమైన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలి.
6. ఇంటర్ బోధన, బోధనేతర సిబ్బంది సీనియారిటీ, పదోన్నతులకు లిఖితపూర్వక రక్షణ కల్పించాలి. ఖాళీలన్నీ భర్తీ చేసి, కొత్త డీఎస్సీ ప్రకటించాలి.
7. విద్యా కమిషన్ సిఫారసు చేసిన ఫీజుల నియంత్రణ చట్టాన్ని తక్షణమే తీసుకురావాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలన్నీ చెల్లించాలి.
8. గురుకుల టెండర్లపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించి, జీవో 17ను రద్దు చేయాలి.
"సంస్కరణ నెపంతో బలవంతంగా రుద్దే అనాలోచిత, స్వార్థపూరిత విధానాలపై ప్రతిఘటన తప్పదు. ఇంటర్మీడియట్ విద్య భవిష్యత్తును నిర్ణయించాల్సింది తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న శాసనసభ. స్వార్థంతో మీరు, మీ చుట్టూ ఉన్న డూడూ బసవన్నల్లాంటి అధికారులు కాదు" అని దాసోజు శ్రవణ్ సీఎం రేవంత్ రెడ్డికి ఘాటుగా హెచ్చరిక చేశారు.


