తెలంగాణ

DK Aruna: ఈసారి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే- డీకే అరుణ

6 నిమిషాల పఠనం

ఎన్నికలకు రెండేళ్ల సమయం మాత్రమే మిగిలి ఉందన్న డీకే అరుణ.. బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు పెద్దఎత్తున ఆశిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలను ప్రజలు చూశారని.. ఈసారి బీజేపీకి అవకాశం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని డీకే అరుణ అన్నారు.

DK Aruna: పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత ఒత్తిడి ఉన్నా సీఎం నియోజకవర్గంతో పాటు ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ప్రజలు బీజేపీని గెలిపించారని ఎంపీ డీకే అరుణ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో బీజేపీ గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే పని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆమె మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాటం చేయాలన్నారు. కేంద్రం నిధులతోనే గ్రామాలలో అభివృద్ధి జరుగుతుందని డీకే అరుణ స్పష్టం చేశారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులతో చెప్పారు.

మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్, తమిళనాడు బీజేపీ సహ ఇంచార్జ్, ఎంపీ డీకే అరుణ, బీజేపీ ప్రధాన కార్యదర్శి గౌతం రావు పాల్గొన్నారు. బీజేపీ పదాధికారులు, ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు తదితరులు హాజరయ్యారు.

6 గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం

కేంద్రం తెలంగాణకి 2లక్షల ఇళ్లను మంజూరు చేసిందని ఎంపీ డీకే అరుణ తెలిపారు. అయితే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇండ్లను మంజూరు చేసుకుంటున్నారని ఆరోపించారు. అర్హులైన వారందరికీ ఇండ్లు ఇచ్చేలా బీజేపీ కార్యకర్తలు పోరాటం చేయాలన్నారు. మూడేళ్లు అవుతున్నా లబ్ధిదారులందరికీ పెన్షన్లు అందడం లేదన్నారు. 6 గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీజేపీ సర్కార్ ఏర్పాటే లక్ష్యంగా, ప్రతి కార్యకర్త సంకల్పం తీసుకొని పని చేయాలన్నారు.

కొడంగల్ లో ప్రజల ఇండ్ల కూల్చివేత

కొడంగల్ లో రోడ్ల విస్తరణ పేరిట బలవంతంగా ప్రజల ఇండ్లను కూల్చివేస్తున్నారని, ఎటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదని డీకే అరుణ ఆరోపించారు. తనను ప్రజలు నమ్మడం లేదని పోలేపల్లి ఎల్లమ్మపై ప్రమాణం చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేశారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రమాణం చేయని దేవుడు రాష్ట్రంలో లేడు.. ఏ దేవుడినీ రేవంత్ రెడ్డి వదలలేదని డీకే అరుణ ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలని పార్టీ శ్రేణులతో చెప్పారు. పాలమూరు జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టులు ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని విమర్శించారు. అబద్ధాలను పదేపదే చెప్పి నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారని.. ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మాయ చేస్తోందని మండిపడ్డారు.

ఎల్ నినో ప్రభావంతో ప్రజలు తీవ్రమైన నీటి సమస్యలు ఎదుర్కొంటున్నారని డీకే అరుణ వాపోయారు. ఈ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలన్నారు.

ఈసారి బీజేపీకే అవకాశం!

ఎన్నికలకు రెండేళ్ల సమయం మాత్రమే మిగిలి ఉందన్న డీకే అరుణ.. బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు పెద్దఎత్తున ఆశిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలను ప్రజలు చూశారని.. ఈసారి బీజేపీకి అవకాశం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని డీకే అరుణ అన్నారు. బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్ ఇచ్చే సలహాలు సూచనలతో పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త సీరియస్ గా కృషి చేయాలన్నారు డీకే అరుణ.

#DK Aruna#Telangana Bjp#Telangana Politics#Swechaa News#Mahabubnagar
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి