జాతీయం

Parliament Session: పార్లమెంట్ ఇంకా నడుస్తూనే ఉందా? తెరపైకి ‘ఆర్టికల్ 85(1)’ పవర్..

6 నిమిషాల పఠనం

Parliament Session: సాధారణంగా పార్లమెంట్ సమావేశాలను ఉభయ సభాపతులు నిరవధికంగా వాయిదా వేసిన రెండు, మూడు రోజుల్లోనే రాష్ట్రపతి భవన్ నుంచి ‘ప్రోరోగ్‌’ (సమావేశాల ముగింపు) నోటిఫికేషన్ విడుదలవుతుంది. కానీ, ఈసారి ఢిల్లీ వేదికగా దేశ పార్లమెంటరీ చరిత్రలోనే ఎన్నడూ చూడని విచిత్ర పరిణామం తెరపైకి వచ్చింది.

Parliament Session: సాధారణంగా పార్లమెంట్ సమావేశాలను ఉభయ సభాపతులు నిరవధికంగా వాయిదా వేసిన రెండు, మూడు రోజుల్లోనే రాష్ట్రపతి భవన్ నుంచి ‘ప్రోరోగ్‌’ (సమావేశాల ముగింపు) నోటిఫికేషన్ విడుదలవుతుంది. కానీ, ఈసారి ఢిల్లీ వేదికగా దేశ పార్లమెంటరీ చరిత్రలోనే ఎన్నడూ చూడని విచిత్ర పరిణామం తెరపైకి వచ్చింది. వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడి దాదాపు మూడు నెలలు గడిచినా, ఇంతవరకు రాష్ట్రపతి నుంచి ముగింపు ప్రకటన వెలువడలేదు. ఫలితంగా గత 89 రోజులుగా పార్లమెంట్ అధికారికంగా ముగియకుండా కొనసాగుతూనే ఉందన్న వార్త దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

2008 నాటి రికార్డు బద్దలు!

గతంలో 2008లో నాటి యూపీఏ ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు జూలై 21, 22 తేదీల్లో లోక్‌సభ సమావేశమైంది. ఆ తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడినప్పటికీ, ప్రోరోగ్ కాకుండా ఏకంగా 87 రోజుల పాటు కొనసాగిన రికార్డు నమోదైంది. అనంతరం అక్టోబర్ 17న తిరిగి సమావేశాలను నిర్వహించారు. అయితే ఇప్పుడు ఏకంగా 88 రోజుల వ్యవధి దాటి, 89 రోజులుగా వర్షాకాల సమావేశాలు కాగితాలపై సజీవంగా కొనసాగుతూ ఆ పాత రికార్డును తిరగరాశాయి.

ఏమిటీ ఆర్టికల్ 85(1) పవర్?

సభను ముగించకుండా ఉంచడం వెనుక రాజ్యాంగంలోని ‘ఆర్టికల్ 85 క్లాజ్ 1’ అత్యంత కీలకమైన అంశంగా మారింది. వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు రాష్ట్రపతి ఆర్టికల్ 85(1) కింద జారీ చేసిన ఉత్తర్వులు నేటికీ అమల్లో ఉన్నట్లే లెక్క. అంటే సాంకేతికంగా సభలు ఇంకా ముగియలేదు. ఈ రూల్ వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఒక అసాధారణమైన అధికారం దక్కుతుంది. రాష్ట్రపతి ప్రమేయం లేకుండా, కొత్తగా ఎలాంటి సమన్లు లేదా అనుమతులు కోరాల్సిన అవసరం లేకుండానే.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సభను తక్షణమే సమావేశపరిచే వెసులుబాటు కేంద్రం చేతుల్లోకి వచ్చింది.

తెరవెనుక ‘850 ఎంపీ సీట్ల’ మాస్టర్ ప్లాన్?

సభను కావాలనే ప్రోరోగ్ చేయకుండా ఉంచడం వెనుక కేంద్రం బలమైన రాజకీయ ఎత్తుగడ వేసిందన్న ప్రచారం ఢిల్లీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ‘నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు’ కోసమే కేంద్రం ఈ నిబంధనను చేతిలో పెట్టుకుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాలంటే డీలిమిటేషన్ ప్రక్రియ తప్పనిసరి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏప్రిల్ 17న కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పటికీ, సరిపడా సంఖ్యాబలం లేకపోవడంతో ఆమోదం పొందలేదు. ఒకవేళ ఈ పునర్విభజన బిల్లు గనుక పాసైతే లోక్‌సభలో ఎంపీల సంఖ్య ప్రస్తుతం ఉన్న 543 నుంచి ఏకంగా 850కి పెరగనుంది.

విపక్షాల ఆగ్రహం.. వింటర్ సెషన్స్‌లోపే సర్‌ప్రైజ్?

పార్లమెంట్ ప్రోరోగ్ కాకపోవడంపై కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వివాదాస్పద డీలిమిటేషన్ బిల్లును ఎలాగైనా నెగ్గించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని తెరవెనుక సమకూర్చుకునేందుకే ప్రభుత్వం కావాలని జాప్యం చేస్తోందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే, పార్లమెంట్ శీతాకాల సమావేశాలను డిసెంబర్ 4 నుంచి 22 వరకు 15 రోజుల పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఈ వారంలోనే అధికారిక షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఆ శీతాకాల సమావేశాల కంటే ముందే.. ఆర్టికల్ 85(1) అస్త్రాన్ని ఉపయోగించి కేంద్రం ఏదైనా అకస్మాత్తుగా ప్రత్యేక సమావేశాన్ని పెడుతుందా? డీలిమిటేషన్ బిల్లుపై మరో బిగ్ ట్విస్ట్ ఇస్తుందా? అన్నది ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

#Parliament Session#Article 85(1)#Indian Parliament#Parliament News#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి