AnnaLezhneva: పుట్టిన గడ్డను వదిలింది.. అలవాటైన జీవనశైలిని పక్కన పెట్టింది.. కట్టుబాట్లు, సంస్కృతి వేరైనా ఒక మనిషిపై ప్రేమతో అచ్చమైన తెలుగింటి కోడలిగా మారిపోయింది. పవన్ కల్యాణ్ కోసం తన దేశం, మతం సైతం మార్చుకుని సనాతన ధర్మాన్ని నిష్టగా పాటించిన ఒక విదేశీ మహిళకు 13 ఏళ్ల కాపురం తర్వాత చివరకు మిగిలింది కేవలం ఒక విడాకుల ప్రెస్ నోట్ మాత్రమేనా? సోమవారం అర్ధరాత్రి పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల పేర్లతో బయటకు వచ్చిన జాయింట్ స్టేట్‌మెంట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద చర్చకు తెరలేపింది.
పవన్ అడుగుల్లో అడుగులు.. భర్త కోసమే జీవితం
ఒక రష్యన్ మహిళగా భారత్‌కు వచ్చి, పవన్ కల్యాణ్ జీవిత భాగస్వామిగా మారిన తర్వాత అన్నా లెజినోవా ప్రవర్తించిన తీరు కోట్లాది మంది అభిమానులను ఆశ్చర్యపరిచింది. పవన్ భావజాలానికి తగ్గట్టుగా ఆమె పూర్తిగా రూపాంతరం చెందారు. రెండుసార్లు కాలిబాటన తిరుమల కొండకు నడిచివెళ్లి, శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుని తన భక్తిని చాటుకున్నారు. పద్ధతిగా చీరలు కట్టుకుని ఇంట్లో సంప్రదాయ పూజలు చేయడం దగ్గర నుంచి.. మెగా కాంపౌండ్‌లో జరిగిన ప్రతి ఫ్యామిలీ ఈవెంట్‌లోనూ అందరితో కలిసిపోయి, ‘వదినమ్మ’గా మెగా అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇలా భర్త ఇష్టానికి అనుగుణంగా తన వ్యక్తిగత గుర్తింపును పూర్తిగా పవన్ జీవితంలో లీనం చేసిన మహిళకు ఇప్పుడు ఎదురైన పరిస్థితి ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది.
సోషల్ మీడియాలో సానుభూతి వెల్లువ.. పవన్‌పై ఆగ్రహం
విడాకుల వార్త అధికారికంగా బయటకు వచ్చిన మరుక్షణమే ఇంటర్నెట్‌లో చర్చ అంతా అన్నా లెజినోవా వైపే మళ్లింది. నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తుండగా, పవన్ కల్యాణ్ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తన జీవితాన్ని, భవిష్యత్తును నమ్మి వచ్చిన ఒక స్త్రీకి పవన్ న్యాయం చేయలేకపోయారనే కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. గతంలో రెండుసార్లు పెళ్లిళ్లు విఫలమైనా.. మూడోసారైనా స్థిరమైన దాంపత్య జీవితం సాగుతుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత ఈ బంధానికి కూడా అర్థాంతరంగా ముగింపు పలకడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
గతంలో విడాకుల తర్వాత నటి రేణు దేశాయ్ నేటికీ రెండో పెళ్లి చేసుకోకుండా పిల్లల భవిష్యత్తే సర్వస్వంగా ఒంటరిగానే జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు అన్నా లెజినోవా కూడా పరాయి దేశంలో, పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయంతో ఒంటరిగా మిగిలిపోవాల్సిన పరిస్థితి దాపురించిందంటూ పలువురు నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత త్యాగం చేసిన తర్వాత కూడా ఒక స్త్రీకి దక్కేది ఇదేనా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
సొంత కేడర్‌కు సమాధానం కరవు
పవన్ కల్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన వీరాభిమానులను, జనసేన పార్టీ కేడర్‌ను తీవ్రంగా కుదిపేస్తోంది. గతంలో ప్రత్యర్థులు పవన్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేసిన ప్రతిసారీ అన్నా లెజినోవా భారతీయ సంస్కృతిని గౌరవిస్తున్న తీరును, ఆమె నిబద్ధతను సాక్ష్యంగా చూపుతూ సమర్థించుకున్నారు. ఇప్పుడు ఆమెనే పక్కన పెట్టేయడంతో జనసైనికులకు ఏం మాట్లాడాలో తోచని పరిస్థితి ఏర్పడింది. ఒక సాధారణ వ్యక్తిగా కాకుండా, కోట్లాది మంది ప్రజలను నడిపించే ఒక ప్రజాప్రతినిధిగా పవన్ తీసుకున్న ఈ నిర్ణయం మహిళా వర్గాల్లో ఎలాంటి సంకేతాలు పంపుతుందోనన్న ఆందోళన పార్టీ వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ కోసం సర్వస్వం వదిలేసిన అన్నా లెజినోవాకు చివరికి ఏం మిగిలిందన్న ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి.


