TG: రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాలిటెక్నిక్ కాలేజీలను కార్మిక శాఖ (శక్తి విభాగం) పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదనను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఇకపై పాలిటెక్నిక్ కళాశాలలన్నీ యథావిధిగా విద్యాశాఖ పరిధిలోనే కొనసాగుతాయని స్పష్టం చేస్తూ తాజాగా జీవో నంబర్ 157 ను జారీ చేసింది. గతంలో జులై 3న విడుదల చేసిన జీవో 97ను సవరిస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చింది.
స్కిల్ యూనివర్సిటీలో విలీనం లేదు..
కొత్తగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. పాలిటెక్నిక్ విద్యను 'యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ'లో విలీనం చేయడం గానీ, కార్మిక శాఖకు బదిలీ చేయడం గానీ జరగదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అంతేకాకుండా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కూడా విద్యాశాఖ కిందే ఉంటుందని జీవోలో స్పష్టతనిచ్చింది. అయితే, రాష్ట్రంలోని ఐటీఐలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు మాత్రం కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ (శక్తి విభాగం) పరిధిలోకి వెళ్లాయి.
నెల రోజుల ఆందోళనలు..
గత జులై 3న తెలంగాణ ప్రభుత్వం జీవో 97ను తీసుకొచ్చి, కార్మిక శాఖ పేరును 'శక్తి'గా మార్చడంతో పాటు పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐలను దాని పరిధిలోకి తెస్తున్నట్లు ప్రకటించింది. పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానం చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనపై విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ విద్యాభవిష్యత్తుకు నష్టం వాటిల్లుతుందంటూ దాదాపు నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఈ అంశంపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం సీనియర్ నేత కె. కేశవరావు నేతృత్వంలో హైపవర్ కమిటీని నియమించింది. అన్ని కోణాల్లో పరిశీలించిన కేశవరావు కమిటీ.. పాలిటెక్నిక్ కాలేజీలను విద్యాశాఖలోనే ఉంచాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తాజాగా జీవో 157 విడుదల చేయడంతో పాలిటెక్నిక్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


