తెలంగాణ

ఇది భారత్ సమ్మిట్ కాదు.. భారత్ వ్యతిరేక సమ్మిట్- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

5 నిమిషాల పఠనం

Kishan Reddy: హైదరాబాద్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన భారత్ సమ్మిట్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది భారత్ సమ్మిట్ కాదు భారత్ వ్యతిరేక సమ్మిట్ అంటూ విరుచుకుపడ్డారు.

Kishan Reddy: హైదరాబాద్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన భారత్ సమ్మిట్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది భారత్ సమ్మిట్ కాదు భారత్ వ్యతిరేక సమ్మిట్ అంటూ విరుచుకుపడ్డారు. దేశ వ్యతిరేక శక్తులను భారత్ సమ్మిట్ కు కు పిలిచారని ఆయన ఆరోపించారు. దేశాన్ని ముక్కలు చేస్తామన్న తుక్ డే తుక్ డే గ్యాంగులను తీసుకొచ్చారని చెప్పారు. భారత్ సమ్మిట్ తో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లభించిందని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. దేశాన్ని విమర్శించేందుకే సమ్మిట్ ఏర్పాటు చేశారా? అని ముఖ్యమంత్రి రేవంత్ ను నిలదీశారు. దేశ వ్యతిరేక శక్తులను ఈ సమ్మిట్‌కు ఎలా ఆహ్వానిస్తారు? అని కిషన్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ పక్కా నియంతృత్వ పార్టీ

కాంగ్రెస్ పక్కా నియంతృత్వ పార్టీ అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రపంచ దేశాల ముందు మన ఎన్నికల వ్యవస్థను చిన్నతనం చేశారని ఆగ్రహించారు. ఎమర్జెన్సీ కాలంలో ఎన్నికలు ఏ తరహాలో జరిగాయో అందరికీ తెలుసన్నారు. బీజేపీ ముఖ్య నాయకులను ఆ సమయంలో జైల్లో పెట్టారని గుర్తు చేశారు. దేశంలో వ్యవస్థలన్నీ కుప్పకూలినట్లు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో ఉగ్రవాదాన్ని అణిచివేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక బాంబు పేలుళ్లు లేవన్నారు.

భారత్ సమ్మిట్‌తో తెలంగాణకు ఏం ఒరిగింది?

ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ సీఎం విదేశాల్లో ఎంత ఇంపాక్ట్ కలిగించారో, ఆయన కలిగించిన ఇంపాక్ట్ ద్వారా తెలంగాణకు ఏ రకమైన లాభం వస్తుందో రేవంత్ రెడ్డి చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి తన గురించి చాలానే మాట్లాడారని, వాటికి జవాబు చెప్పుకోవాల్సిన కర్మ తనకు లేదన్నారు.

బీజేపీ అధికారంలోకి వచ్చాక బాంబు పేలుళ్లు లేవు

''తీవ్రవాదులను, ఈ దేశంలో రక్తపాతం సృష్టించాలనుకున్న వాళ్లను, ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయాలనుకున్న వాళ్లను, దేశంలో వేర్పాటు వాదాన్ని సృష్టించాలనుకున్న వాళ్లను, దేశంలో మత కలహాలు పెంచాలనుకున్న వాళ్లను, దేశంలో కర్ఫ్యూ తీసుకొచ్చే వాళ్లను, ఆర్డీఎక్స్ బాంబులు పేల్చే వాళ్లను కచ్చితంగా మేము అణిచివేశాము'' అని కిషన్ రెడ్డి అన్నారు.

దేశాన్ని అవమానిస్తూ మాట్లాడారు

''భారత్ సమ్మిట్ పేరుతో దేశ వ్యతిరేక కార్యక్రమం నిర్వహించారు. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని, కుట్రలు చేసే వారిని.. రానుపోను టికెట్ల పైసలు ఇచ్చి మరీ ఈ సమ్మిట్ కు ఆహ్వానించారు. అసలు ఈ సదస్సును ఎవరి కోసం నిర్వహించారు? దేశ వ్యతిరేక శక్తులను తీసుకొచ్చి, వారి ముందు దేశాన్ని అవమానిస్తూ మాట్లాడారు. దేశానికి ఏదో సేవ చేసినట్లుగా వారికి ఆహ్వానం పలికారు. వచ్చిన వాళ్లు సమాజం కోసం సేవ చేసినోళ్లా? భారత వ్యతిరేక శక్తులను గుర్తించి మరీ సదస్సుకు తీసుకొచ్చారు'' అని సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డారు కిషన్ రెడ్డి.

#Bharat Summit 2026#Telangana#Hyderabad#Kishan Reddy#Cm Revanth Reddy#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి